సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ) : ఫ్లె ఓవర్లు..ఆర్వోబీ..ఆర్‌యూబీలు, రహదారులు, నాలాల విస్తరణ..లింకు రోడ్లు…అభివృద్ధి ఏదైనా సకాలంలో ప్రాజెక్టు పూర్తి కావాలంటే భూసేకరణే అత్యంత కీలకం. ఆయా ప్రాజెక్టు వ్యయం ఎంత ఖర్చు అవుతుందో..భూసేకరణకు అంతే స్థాయిలో వ్యయమవుతుంది. అయితే ఆస్తుల సేకరణలో గణనీయమైన మార్పును గత ప్రభుత్వం తీసుకొచ్చింది. 2017లో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ‘టీడీఆర్’ పాలసీని తీసుకొచ్చారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ అభివృద్ధి పథకాల కోసం చేపట్టే భూసేకరణ, ఆస్తుల సేకరణ సందర్భంగా ఇచ్చే నగదు నష్టపరిహారానికి బదులుగా ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) అమలు చేశారు.
దేశంలో మరే ఏ నగరంలో జరుగని విధంగా రికార్డు స్థాయిలో ఈ టీడీఆర్‌లను జీహెచ్ఎంసీ అందజేసింది. అభివృద్ధి కార్యక్రమాలకు చేసే భూ సేకరణలకు నగదు మొత్తం ఇవ్వడానికి బదులుగా టీడీఆర్‌లు ఇచ్చే విధానాన్ని, టీడీఆర్ బ్యాంకును ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నీతి అయోగ్ కూడా ప్రశంసించడం గమనార్హం. ఈ టీడీఆర్ విధానాన్ని ఇతర రాష్ర్టాలు కూడా అవలంభించాలని నీతి అయోగ్ సూచించింది. ఇంత విజయవంతమైన టీడీఆర్ పాలసీని నీరుగార్చింది ప్రస్తుత ప్రభుత్వం. పాతనగరంలో టీడీఆర్‌లకు కనీస ఆదరణకు నోచుకోవడం లేదు. టీడీఆర్ వద్దంటూ పరిహార బాధితులంతా పరార్ అవుతున్నారు. టీడీఆర్ వద్దు నష్టపరిహారమే కావాలంటున్నారు. దీంతో సకాలంలో ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందకపోవడంతో పాత నగరంలో అధికారులకు ఆస్తుల సేకరణ సవాల్‌గా మారింది.
Ghmc
వివిధ అభివృద్ధి పథకాల కోసం..
గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ అభివృద్ధి పథకాల కోసం చేపట్టే భూసేకరణ, ఆస్తుల సేకరణ సందర్భంగా జీహెచ్ఎంసీ టీడీపీఆర్ పత్రాలను అందజేస్తున్నారు. అభివృద్ధి పనులకు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమిని సేకరించి, నగదు పరిహారానికి ప్రత్యామ్నాయంగా ఈ టీడీఆర్‌ను ఇస్తున్నారు. ఏదైన ఒక నిర్వాసితుడు నాలా విస్తరణ వల్ల ఏ మేరకు స్థలాన్ని కోల్పోయాడో, అంతకు నాలుగు రెట్లకు టీడీఆర్ పత్రాలను పరిహారంగా పొందుతాడు. ఉదాహరణకు అమీర్‌పేటలో 20 గజాల స్థలాన్ని కోల్పోయిన నిర్వాసితుడు జీహెచ్ఎంసీ ఇచ్చే 80 గజాల టీడీఆర్ పత్రాన్ని తీసుకుని ఇతరులకు విక్రయించుకునే హక్కు పొందుతాడు. టీడీఆర్ పత్రం కలిగిన వారు, జీహెచ్ఎంసీ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి ఇచ్చే అనుమతికి అదనంగా చేపట్టే నిర్మాణ వైశాల్యాన్ని నిబంధనలను అనుసరించి క్రమబద్ధీకరించుకోవచ్చు. ఫలితంగా లక్ష రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో..టీడీఆర్ ద్వారా అంతకు రెట్టింపు లేదా, తనకు నచ్చిన మొత్తానికి విక్రయించుకుని లాభపడుతున్నారు. అయితే పాతనగరం మినహా ఇతర ప్రాంతాల్లో ఈ టీడీఆర్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. మార్కెట్లో టీడీఆర్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కానీ పాతనగరంలో మాత్రం టీడీఆర్‌లను వద్దంటున్నారు. ఈ విషయంలో అవగాహన కల్పించడంలో అధికారుల వైఫల్యమేనని చెప్పవచ్చు.
ఎస్ఆర్డీపీలో భాగంగా..
మొత్తంగా పాత నగరంలో వివిధ అభివృద్ధి పనులకు ఆస్తుల సేకరణ నత్తనడకగా సాగుతున్నది. ఎస్ఆర్డీపీలో భాగంగా జూ పార్కు-ఆరాంఘర్ ఫ్లై ఓవర్, సర్వీస్ రోడ్ల విస్తరణ, సైదాబాద్‌లో స్టీల్ బ్రిడ్జి పనుల్లో భాగంగా ఆస్తుల సేకరణే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నది. వీటితో పాటు నాలాల అభివృద్ధి, రహదారుల విస్తరణలో భూసేకరణ జాప్యమవుతున్నది. జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం టీడీఆర్ వద్దంటున్నారంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ నిధుల సమస్యతో కొట్టుమిట్టాడుతుండడంతో స్పెషల్ ఫండ్ కింద పాత నగరంలో భూ పరిహార బాధితులకు ప్రభుత్వం నుంచే నష్ట పరిహారం అందజేస్తూ వస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం ఆలస్యంగా వస్తుండడంతో ఆస్తుల సేకరణ సందిగ్ధంలో పడింది.