‘రెండు నెలలాయె.. కరెంట్ లేక సచ్చిపోతున్నం.. రాత్రి అయితే భయంభయం ఐతున్నది. ఒక వైపు రాళ్లకుప్పలు.. మరో వైపు పాములు.. వర్షాకాలం పోయింది.. చలికాలం వచ్చింది. ఇప్పటికీ కరెంట్ రాదాయె.. గుడ్డి దీపాల్లో బతుకుతున్నం. కరెంటోళ్లను అడిగితే రేపు మాపు అంటున్నరట. ఈ సర్కార్‌కు పేదోళ్లు కనపడరా.. పెద్దోళ్లే కనపడతరా.. మాకు కరెంట్ కట్ చేసి పెద్దోళ్లకు మాత్రం కరెంట్ ఇస్తరా.. ఇదేం అన్యాయమం’టూ ప్రశ్నిస్తోంది మణెమ్మ అనే మహిళ.
‘ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. రాత్రి అయ్యిందంటే ఎట్లర దేవుడా.. ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తున్నం.. రెండు నెలల కిందట కరెంట్ సైప్లె నిలిపేశారు. అప్పటివరకు కరెంట్ బిల్లులు కట్టించుకున్నరు. ఆ తర్వాత మీటర్లు పట్టుకుపోయిండ్రు. ఇదేందని అడిగితే సర్కార్ చెప్పిందన్నారు. ఆఫీసర్ల దగ్గరికీ పోతే మీకు కరెంట్ ఇస్తే ఖాళీ చేయరని అంటున్నరు. గిదేం పద్ధతం’టూ ఆవేశంగా అడిగాడు శ్రీను అనే యువకుడు.
Sunnam Cheruvu | రాత్రి అయితే చిమ్మ చీకటి.. ఎక్కడెవరు ఉన్నారో.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని దుర్భర పరిస్థితి.. బండి దీపాలు, సోలార్ దీపాలు , మంటల వెలుగుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్న కుటుంబాలు.. ఎక్కడో మారుమూల గ్రామం కాదది. హైదరాబాద్‌లో హైటెక్ సిటీకి అత్యంత సమీపంలో ఉన్న మాదాపూర్ గుట్టల బేగంపేటలోని సున్నం చెరువు వద్ద ప్రస్తుత పరిస్థితి ఇది. సెప్టెంబర్ 8న గుట్టల బేగంపేటలోని సున్నం చెరువు వద్ద హైడ్రా చేపట్టిన కూల్చివేతలు కొన్ని కుటుంబాలను రోడ్డున పడేశాయి. అవే శిథిలాల మధ్య జీవనం వెళ్లదీస్తున్న బాధితుల దుస్థితి ఇది.
సిటీలోనే ఉన్నా.. తమ ప్రాంతంలో కరెంట్ లేక .. అది కూడా అధికారుల అలసత్వంతో తమ నివాసాల్లో వెలుగులు లేక నానా అవస్థలు పడుతున్నారు. సున్నంచెరువు సమీపంలో ఇది ఏ ఒకరిద్దరి సమస్యో కాదు. ఏకంగా 60 కుటుంబాల సమస్య. 15 ఏండ్ల కిందట సొసైటీగా ఏర్పడి కొన్న స్థలాలు మీవి కావంటూ అక్కడ కట్టుకున్న ఇండ్లను సర్కారు కూల్చేస్తే బతుకు జీవుడా.. ఇదేం సర్కారు దేవుడా అంటూ కన్నీరు మున్నీరైన ఆ బాధిత కుటుంబాలు అదే ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకుని బతుకుతున్నారు.
ఇక హైడ్రా కూల్చివేతల ప్రాంతానికి కొంచెం దగ్గరలో ఉన్న మరికొన్ని ఇండ్లకు కూడా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. రెండునెలలుగా తమకు సైప్లె లేకున్నా కరెంట్ వాళ్లను అడగాలంటేనే ఆయా కుటుంబాలు భయపడుతున్నాయి. తమ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా.. ఎప్పుడేం జరుగుతుందోనంటూ అసలు తమ సమస్యను బయటకు చెప్పుకోకుండా ప్రత్యామ్యాయ మార్గాల ద్వారా లైట్లు వేసుకుని బతుకుతున్నారు. ఇక సున్నంచెరువులో బాధితులు మాత్రం తమలో కొంతమందికి మీటర్లు ఉన్నా కరెంట్ ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారు. కొందరేమో తమ మీటర్లు కూడా తీసుకుపోయారని, ట్రాన్స్‌కో వాళ్లను అడిగితే మీకు కరెంట్ ఇస్తే అక్కడి నుంచి ఖాళీ చేయరని అందుకే కరెంట్ ఇయ్యమని పంపించేశారని వారు చెబుతున్నారు.
సెప్టెంబర్‌లో కూల్చేసిన ఇండ్లకు సంబంధించి బాధిత కుటుంబాలకు కూల్చేసే సమయంలో కరెంట్ సైప్లె కట్ చేస్తే ఇప్పటివరకు మళ్లీ ఆ ప్రాంతంలో సరఫరా ఇవ్వనేలేదు. తమ ఇండ్లలో కరెంట్ లేకపోవడంతో సోలార్ దీపాలు, బండి దీపాలు, మంటల వెలుగుల్లో తమ జీవితాలను వెళ్లదీస్తున్నారు ఈ ప్రాంత వాసులు. మరెక్కడికైనా వెళ్లి బతకొచ్చు కదా అంటే తామంతా వలసలు వచ్చినోళ్లమని, రెక్కాడితే డొక్కాడని తాము కష్టపడి కట్టుకున్న ఇండ్లను అన్యాయంగా కూలగొట్టిన సర్కార్.. తమ జీవితాల్లో వెలుగులే లేకుండా చేసిందంటూ ఆక్రోషంగా మాట్లాడుతున్నారు. మంటల వెలుగుల్లో చిన్నపిల్లలను చూసుకుంటూ రాత్రివేళ నిశాచరుల్లా బతుకుతున్నారు. తమ పిల్లలకు దోమలు కుట్టకుండా ఉండడానికి అక్కడే మంటలు పెట్టి పొగ పెడుతున్నారు. తమకు కరెంట్ ఇవ్వమని ఎన్ని సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోతున్నదని వారు చెబుతున్నారు.
హైడ్రాతో ట్రాన్స్‌కో అధికారులకు ఉన్న సమన్వయలోపం ఈ ప్రాంతవాసులకు శాపంగా మారింది. సున్నం చెరువు వద్ద ఎఫ్టీఎల్, బఫర్జోన్ల హద్దుల నిర్ధారణ జరగాల్సి ఉంది. అక్కడ కూల్చివేతల ప్రాంతానికి సంబంధించినంత వరకు రెండు బిల్డింగులకు మాత్రమే సైప్లె ఇవ్వొద్దని హైడ్రా చెప్పారట. మిగతావాటి విషయంలో వారెలాంటి నిర్ణయం చెప్పలేదు. ఎక్కడైనా కూల్చివేతలు జరిగినప్పుడు అక్కడ సైప్లె నిలిపివేసే ట్రాన్స్‌కో తిరిగి అక్కడ పని పూర్తయ్యాక పునరుద్ధరిస్తారు. కానీ సున్నం చెరువు వద్ద సైప్లె ఆపేశారు తప్ప..పునరుద్ధరించలేదు. సున్నం చెరువు వద్ద ఆక్రమణలంటూ కూల్చేసిన ఇండ్లకు మీటర్లు కూడా ఉండేవి. సుమారు 25 వరకు మీటర్లను విద్యుత్ అధికారులు తమతో తీసుకెళ్లారు.
వారంతా రెగ్యులర్‌గా కరెంట్ బిల్లు కడుతున్నవాళ్లే. మరి వారికిచ్చిన మీటర్లపై అధికారులు మాత్రం మీటర్లు వారివద్దనే ఉన్నాయని చెప్పారు. కొన్ని మీటర్లు మాత్రమే ఉన్నాయని వాటికి కూడా సైప్లె ఇవ్వడం లేదని స్థానికులు చెబుతున్నారు. హైడ్రా నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మీటర్లను తొలగించారేమో అని అనుకుంటే అది కూడా పొరపాటే. కూల్చివేసే సమయంలో తమకు కేవలం రెండు బిల్డింగులకు సంబంధించి మాత్రమే హైడ్రా నుంచి సమాచారం ఉందని, మిగతా వాటి విషయంలో ఎవరూ తమను సంప్రదించకపోవడం వల్లే మీటర్లు ఇవ్వకపోవడం కానీ, సైప్లె పునరుద్ధరించడం కానీ జరగలేదని అధికారులు చెప్పారు. హైడ్రా వాళ్లు కూల్చివేతల తర్వాత ఏం చేయాలనేది మాకు డైరెక్షన్ ఇవ్వడమో లేక కనీసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది చెప్పకుండానే వెళ్లిపోయారని ట్రాన్స్‌కో వాళ్లు అంటున్నారు.
తమ ఇండ్లలో కరెంట్ లేకున్నా.. తాము ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కరెంట్ తీసుకుంటున్నాం తప్ప.. కరెంట్ ఆఫీసుకు వెళ్లి చెబితే తమ ఇండ్లను కూడా హైడ్రా కూల్చేస్తుందేమోనని భయపడుతున్నారు. కూల్చివేతల సమయంలో సుమారు 100 ఇండ్లకు పైగా కరెంట్ సైప్లె నిలిచిపోయినట్లు అధికారులే ఆఫ్ ది రికార్డ్‌గా చెబుతున్నారు. ఇందులో ముప్పై నుంచి నలభై ఇండ్ల వరకు అదే కేబుల్ లైన్లో సైప్లె జరగాల్సి ఉంది. కానీ కరెంట్ సరఫరా ఆపేసిన తర్వాత తిరిగి పునరుద్ధరించమని ఎవరూ అడగలేదు.. విద్యుత్ శాఖ పట్టించుకోలేదు. మాకెందుకిదంతా.. హైడ్రా చూసుకుంటుందిలే అనుకున్నారు. తమ కండ్ల ముందర కొన్ని ఇండ్లు నేలమట్టమవుతుంటే చూసిన కొందరు కాలనీ వాసులు.. తమ ఇండ్లపైకి ఎక్కడ హైడ్రా బుల్డొజర్లు వచ్చి పడతాయోనన్న భయానికి… కరెంట్ వచ్చినప్పుడే చూద్దాం లే అనుకుంటూ అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే దగ్గర ఉంటున్నట్లు సమాచారం.
పొట్టచేతిన పట్టుకొని జీవనం సాగిస్తున్న మాకు ప్రభుత్వం అన్ని విధాల తీరని అన్యాయం చేసింది. ఓ పక్క నివాసాలు ఏర్పరుచుకొని జీవనం సాగిస్తున్న ఇండ్లను కూల్చివేసి కరెంట్ లేకుండా చేసింది. రాత్రులు మంట వేసుకొని నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాం. అధికారుల వద్దకు కరెంట్ కోసం వెళ్తే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని తిప్పుకుంటున్నారు.
– వెంకటేశ్, సున్నం చెరువు బాధితుడు
హైడ్రా నిర్వాకంతో ట్రాన్స్‌కో డిపార్ట్మెంట్ పుణ్యమా అంటూ.. రెండు నెలల నుంచి కరెంట్ లేకుండా చీకట్లో గడుపుతున్నాం. చిన్న పిల్లలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం. మాకు రేవంత్ రెడ్డి అన్యాయం చేసిండు. ఇండ్లు కూల్చి బతుకులు రోడ్డు మీద పడేసిండు.
-శ్రీను, సున్నం చెరువు నివాసి
కూల్చివేతల సమయంలో కరెంట్‌ను తీసివేయమని హైడ్రా అధికారులు చెప్పారు. అయితే విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటి వరకు కరెంట్ సరఫరా పునరుద్ధరించలేదు. కొంతమంది వద్ద మీటర్లు లేకుండా తీసుకువెళ్లిండ్రు. అయితే అధికారులను కలిస్తే వాళ్లు ఎంక్వైరీ చేస్తమన్నరు. కానీ ఏం చేయలేదు.
– సత్యం, సున్నం చెరువు
చిన్నపిల్లలతో చీకట్లో బతకాలంటే భయమైతాంది. రాత్రి ఏ పురుగో, బూచో వస్తే మా గతేంకాను. సర్కారోళ్లు అన్యాయంగా మా ఇండ్ల కరెంట్ తీసేసిండ్రు.
– లక్ష్మి, సున్నం చెరువు