సిటీబ్యూరో, మార్చి30 (నమస్తే తెలంగాణ): వరంగల్‌కు చెందిన 30 ఏళ్ల కృష్ణ, 2024 జులైలో అపెండెసిస్ సమస్యతో బాధపడుతూ.. వరంగల్‌లోని బంధన్ ప్రైవేట్ దవాఖానలో చేరాడు. అక్కడ శస్ర్త చికిత్స చేయించుకోగా.. వికటించింది. వెంటనే హైదరాబాద్‌లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా వారు అధిక సొమ్ము డిమాండ్ చేశారు. అప్పటికే మొదటి శస్ర్త చికిత్స సరిగ్గా చేయకపోవడంతో మంచానికే పరిమితమయ్యాడు. తనకు జరిగిన చికిత్స పై అనుమానంతో ఆపరేషన్ థీయేటర్లో తీసిన వీడియో కావాలని ఆసుపత్రిని సంప్రదించగా సిబ్బంది స్పందించలేదు. తనకు న్యాయం జరగాలని, ఆ వైద్యశాలపై చర్యలు తీసుకోవాలని 2024 డిసెంబర్ లో మెడికల్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు ఆ కేసు పురోగతిలో లేకపోవడం గమనార్హం.
2024లోనే 31 కేసులు నమోదు..
నాణ్యమైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులపై రాష్ర్ట వ్యాప్తంగా మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదులు అందుతున్న తరుణంలో వాటిని పరిష్కరించేందుకు మెడికల్ కౌన్సిల్ చర్యలు తీసుకోవడం లేదు. పెండింగ్ కేసులను పరిష్కరించడంలో ఇంకా వెనుకబాటుతోనే ఉంది. 2019 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన వైద్యం అందించలేదని పలువురు వైద్యులపై 95 కేసులు నమోదయ్యాయి.
ఒక్క 2024 ఏడాదిలోనే 31 కేసులు కేవలం బాధితుల నుంచే వచ్చాయంటే వైద్యం ఏ స్థాయిలో అందుతుందో అర్థం చేసుకోవచ్చు. వైద్యపరమైన నైతికత , నిర్లక్ష్యం, అక్రమ వైద్యం, అర్హతలేకుండా వైద్యం అందిస్తే మెడికల్ కౌన్సిల్ కొరడా ఝలిపిస్తుంది. రోగికి సరైన వైద్యం అందించకపోవడం, తప్పుడు చికిత్స అందించడం, అవసరమైన పరీక్షలు, వైద్య పద్ధతులు పాటించకుండా అనవసరమైన తప్పిదాలు చేయడం, శస్తచ్రికిత్సల్లో ఘోరమైన తప్పిదాలు, సరైన అర్హతలు లేకుండా వైద్యం చేయడం, నకిలీ డిగ్రీలు పొందిన వైద్యులు, అనుమతి లేని లేదా నిషేధిత మందులు వాడడం వంటి ఫిర్యాదుల్లో నిత్యం బాధితులు మెడికల్ కౌన్సిల్ కార్యాలయంలో వినతులు ఇస్తున్నారు. అధికారులు స్వీకరిస్తున్నారు. కానీ సకాలంలో చర్యలు చేపట్టడం లేదన్నది బాధితుల నుంచి వినిపిస్తున్న వాదన.
జాప్యం వల్ల వారికే మేలు..
బాధితుల నుంచి అందిన ఫిర్యాదులను మెడికల్ కౌన్సిల్ సకాలంలో పరిష్కరించకపోవడం మూలాన నకిలీ వైద్యులు, నాణ్యమైన వైద్య సేవలందించని పలు ఆసుపత్రులవాళ్లు మరింతగా రెచ్చిపోతూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. తప్పులు చేసినా శిక్షలు పడవనే ధీమా వాళ్లలో ఎక్కువైంది. మరోవైపు వైద్యం పేరుతో అధిక ఫీజులు వసూల్ చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఒకవైపు నిర్లక్ష్యపు వైద్యం, మరోవైపు చర్యలు తీసుకోలేని మెడికల్ కౌన్సిల్ తీరు పట్ల సామాన్యులు అసహనంతో ఉన్నారు.