సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): చాట్ జీపీటీ సహాయం తీసుకుని పేరున్న సంస్థ ఫ్రాంచైస్ కోసం దరఖాస్తు చేసుకున్న ఒక మహిళను సైబర్‌నేరగాళ్లు నిండా ముంచేశారు. పేరున్న సంస్థల ఫ్రాంచైస్ల కోసం ఇంటర్నెట్లో సర్చ్ చేసే వారిని సైబర్‌నేరగాళ్లు వల వేసి నిండా ముంచేస్తున్నారు. ఇటీవల జూడియో పేరుతో ఒక వ్యక్తిని రూ.47 లక్షలు మోసం చేసిన సైబర్‌నేరగాళ్లు తాజాగా డామీనోస్ ఫ్రాంచైస్ ఇస్తామంటూ ఓ మహిళను నమ్మించి రూ.17 లక్షలు ముంచేశారు.
ఇలా సైబర్‌నేరగాళ్లు పేరున్న సంస్థల పేరుతో వెబ్సైట్లను తయారు చేస్తూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఏదీ అసలు.. ఏదీ నకిలీ అని గుర్తుపట్టలేని విధంగా ఆయా సంస్థల పేర్లతో నకిలీలు వెబ్సైట్లు తయారు చేస్తున్నారు. వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో మొత్తం ఇంటర్నెట్లోనే శోధన చేసి వెనుకా ముందు ఆలోచించకుండా డబ్బులు చెల్లిస్తూ చాల మంది లక్షల రూపాయలు పొగొట్టుకుంటున్నారు.
చాట్‌జీపీటీతో దరఖాస్తు!
దాతునగర్కు చెందిన బాధితురాలైన గృహిణి బీటెక్ వరకు చదివింది. ఆమె డామీనోస్ పుడ్ ఫ్రాంచైస్ ప్రారంభించాలని భావించింది, జుబ్లియెంట్- పుడ్ వర్కర్స్.కామ్ అనే వెబ్సైట్లో పరిశీలించింది. ఆ వెబ్‌సైట్‌కు దరఖాస్తు పంపించేందుకు చాట్‌జీపీటీ సహాయం తీసుకుంది. చాట్‌జీపీటీలో డామీనోస్ పుడ్ ఫ్రాంచైస్ కోసం దరఖాస్తు చేయాలని వివరాలు తీసుకొని అందులోని అంశాలతో జూబ్లీయెంట్- పుడ్ వర్కర్స్ వెబ్సైట్లో ఆన్లైన్లో ఫిబ్రవరిలో దరఖాస్తు చేశారు.
కొన్ని రోజుల తర్వాత జుబ్లియెంట్ పుడ్ వర్కర్స్ కంపెనీ నుంచి కస్టమర్ రిలేషన్ హెడ్‌ని మాట్లాడుతున్నాను, నా పేరు విభోర్గుప్త అంటూ బాధితురాలితో మాట్లాడారు. మీ వివరాలతో ఇన్ఫో డామినోస్పార్టనర్ ఇండియా. కామ్‌కు మెయిల్ చేయాలని సూచిస్తూ మీరు దరఖాస్తు ఫీజు చెల్లించాలంటూ సూచించారు.
తర్వాత 10 రోజులకు ఫోన్ చేసి మీరు అప్లికేషన్ ఫ్రాంచైస్ ఫీజ్‌కు రూ.2.65,500 చెల్లించాలంటూ డబ్బులు వసూలు చేశారు. తర్వాత గవర్నమెంట్ నుంచి ఎన్ఓసీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ఫీజులంటూ మొత్తం రూ.17.95 లక్షలు వసూలు చేశారు. మేం హైదరాబాద్‌కు వచ్చి సైట్ విజిట్ చేస్తామని చెప్పిన సైబర్‌నేరగాళ్లు ఆ తర్వాత సెల్‌ఫోన్ స్వీచాఫ్ చేశారు. దీంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చచేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల జుడియో ఫ్రాంచైస్ పేరుతో..
గత నెలలో మన్నెగూడకు చెందిన వృత్తిరీత్యా వైద్యుడైన బాధితుడు జుడియో ఫ్రాంచైస్ తీసుకోవడానికి ఆన్లైన్లో ప్రయత్నించాడు. జుడియో పేరుతో ఉన్న ఒక వెబ్సైట్లోకి వెళ్లి వాటెండ్ ఫ్రాంచైస్‌లో ఉన్న గూగుల్ ఫామ్‌ను నింపి వివరాలన్ని పంపించాడు. దీంతో అక్కడి నుంచి పంపించాడు. రెండు మూడు రోజుల్లో మీరు ఫ్రాంచైస్ తీసుకోవడానికి ఇష్టం చూపుతున్నందుకు ధన్యవాదాలు, మా ప్రతినిధి మీతో మాట్లాడుతాడని మేసేజ్ వచ్చింది.
అన్నట్లుగానే తర్వాత ప్రకాష్ అనే పేరుతో తాను ఫ్రాంచైస్ డెవెలప్మెంట్ మేనేజర్‌నని ఫోన్ చేశాడు. మీకు ఫ్రాంచైస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, మీరు మొదట రిజిస్టేష్రన్ ఫీజు చెల్లించాలని కొంత, తరువాత లైసెన్స్ ఫీజ్, సెక్యూరిటీ డిపాజిట్, ఎన్ఓసీ, అగ్రిమెంట్ ఫీజ్ అంటూ రూ.4773500 చెల్లించాడు. ఇంకా డబ్బు చెల్లించాలని అడుగుతుండడంతో తాను నేరుగా వచ్చి హెడ్ ఆఫీస్‌లో కలుస్తానంటూ కోరాడు. ముంబాయిలో హెడ్ ఆఫీస్ ఉందంటూ తప్పుడు చిరునామాలు చెప్పి, సెల్‌ఫోన్‌ను స్వీచాఫ్ చేశారు. ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.