ఖైరతాబాద్, ఫిబ్రవరి 28 : పీఎంసీ ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవకాంత్ బెయిల్ రద్దు చేయాలని లైంగిక దాడికి గురైన బాధితురాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆమెకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. 2021 జనవరి 1న బంజారాహిల్స్ రోడ్ నంబర్. 10లో పీఎస్ఎస్ఎమ్ మీడియా లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీఎంసీ యూట్యూబ్ ఛానల్ ఆఫీసులో రిసెప్షనిస్టుగా విధుల్లో చేరానన్నారు. కొద్ది రోజుల తర్వాత ప్రోగ్రాం ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు ఇచ్చారన్నారు. ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవకాంత్తో కలిసి పలువురు ఆధ్యాత్మికవేత్తలు, ఆ అంశాలకు సంబంధించిన ఇంటర్వ్యూలకు వెళ్లేదానినని తెలిపారు.
2022 అక్టోబర్ 8న నవకాంత్ ఓ కారులో ఇంటర్వ్యూ కోసం బేగంపేటలోని రాఘవేంద్ర గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లారని తెలిపింది. ఇంటర్వ్యూ చేయాల్సిన వ్యక్తి వస్తాడని సమ యం పడుతుందని అక్కడే కూర్చోబెట్టాడన్నారు. సాయంత్రం తాను వేచి ఉన్న గదికి వచ్చిన నవకాంత్ బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడని వాపోయింది. సాయంత్రం 7 గంటలకు తాగునీరు ఇచ్చి తనను పెండ్లి చేసుకుంటానని చెప్పి వెళ్లిపోయాడన్నారు. దీంతో అతని మాటలు నమ్మి ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేదన్నారు.
ఆ తర్వాత తరచూ తనను ఆఫీసు నుంచి ఇంటికి కారులో దించేవాడని, ఆదివారాలు సైతం ఆఫీసుకు రమ్మనేవాడని, ఎవరూ లేని సమయంలో పలుసార్లు లైంగికంగా వాడుకున్నాడని వాపోయింది. రోజులు గడిచినా పెండ్లి ప్రస్తావన రాకపోవడంతో నిలదీశానని చెప్పింది. దీంతో గత ఏడాది జూన్ 10న ఆఫీసులో పనిచేసే నటరాజ్ అనే వ్యక్తితో కలిసి కారులో కేబీఆర్ పార్క్‌కు తీసుకెళ్లి అక్కడ పెండ్లి చేసుకునే ఉద్దేశం లేదని తనకు చెప్పాడన్నారు. ప్రశ్నించడంతో తీవ్రంగా కొట్టాడన్నారు.
నవకాంత్‌కు అప్పటికే వివాహం జరిగినట్లు తనకు తెలిసిందని,దీంతో పీఎం సీ కార్యాలయంలోనే అందరి ముందు నిలదీశానని, అక్కడే ఉన్న ఛానల్ యాంకర్ ప్రొడ్యూసర్, అతడి స్నేహితురాలైన మిట్టపల్లి రజిత పోలీసులు, మీడియాకు చెబితే తనపై లైంగిక దాడి జరిపినప్పటి వీడియోలు, ఫొటోలు తమ వద్ద ఉన్నాయని, వాటిని బయట పెడతామంటూ బెదిరించారన్నారు. అయినా గత ఏడాది డిసెంబర్ 16న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిపై 376, 341, 506, 323 రెడ్ విత్ 34సెక్షన్ల కింద(ఎఫ్ఐఆర్ నం. 1154/2024) కేసులు నమోదు చేశారన్నారు. నిందితుడు బెయిల్‌పై వచ్చి బయట తిరుగుతున్నాడు. ఇప్పటికే కమిషనర్, డీసీపీలను కలిశానని, సరైన స్పందన లేదన్నారు. తన వీడియోలు, ఫొటోలు ఉన్నాయని చెబుతున్నా అతడి ఫోను సైతం సీజఖ చేయలేదన్నారు. తక్షణమే నవకాంత్ బెయిల్ రద్దు చేయాలని, సీఎం స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నది.