బంజారాహిల్స్, మార్చి 21: ఆస్తి పన్ను చెల్లించకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్న సంస్థలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. రూ.31 లక్షల ఆస్తిపన్ను బకాయి కలిగి ఉన్న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని వియామిలానో పబ్ ను జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు.
గతంలో పబ్ నిర్వాహకులు రెండుసార్లు బకాయిల చెల్లింపు కోసం ఇచ్చిన చెక్కులు బాండ్స్ కావడంతో రెండు నోటీసులు అందజేశారు. నోటీసులకు స్పందించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి పబ్ సీజ్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లోని షాంగ్రిల్లా ప్లాజా భవనానికి సంబంధించిన ఆస్తిపన్ను బకాయి రూ 1.27 కోట్లు ఉండడంతో భవనాన్ని సీజ్ చేసేందుకు అధికారులు శుక్రవారం చేరుకున్నారు. భవనాన్ని సీజ్ చేయాల్సి ఉంటుందని నిర్వాహకులకు తెలిపారు. రాత్రిలోగా ఆస్తి పన్ను బకాయిలు చెల్లిస్తామని చివరి అవకాశం ఇవ్వాలంటూ కోరడంతో అధికారులు వెనుతిరిగారు.