సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : తెలుగు రాష్ర్టాల్లోనే మొదటి సారిగా ఉస్మానియా దవాఖానలో ప్లాస్టిక్ సర్జరీ విభాగాన్ని ప్రారంభించి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన డాక్టర్ డీఎల్ఎన్ ప్రసాద్ (91) కన్నుమూశారు. బంజారాహిల్స్‌లోని ఓమెగా ఆస్పత్రి లేన్‌లో తన చిన్న కుమార్తె ఇంటి వద్ద వృద్ధాప్య సమస్యతో ఆయన కన్నుమూశారు. 1972లో ఉస్మానియా దవాఖానలో తొలిసారి ప్లాస్టిక్ సర్జరీ విభాగాన్ని ఏర్పాటు చేసి, ఆ విభాగం విస్తరణకు కృషి చేశారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
పెద్ద కుమార్తె గైనకాలజీ వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నం.12లో ఆయన చిన్న కుమార్తె ఇంటి వద్ద ఉంటున్నారు. బోనసాయి మొక్కలను పెంచడం ఆయన అభిరుచిగా పెట్టుకున్నారు. వైద్యులు ఆయనను తెలుగు రాష్ర్టాల్లో తొలి ప్లాస్టిక్ సర్జరీ విభాగాన్ని ప్రారంభించిన పితామహుడిగా పిలుస్తారు. ఆయన మృతిపట్ల ఉస్మానియా వైద్యులు, వైద్య నిపుణులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.1935లో ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన డాక్టర్ ప్రసాద్ చదువులో ప్రతిభ కనబర్చి వైద్య విద్యను ఎంచుకున్నారు.
1961లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆయన 1964లో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కళాశాల నుంచి జనరల్ సర్జరీలో ఎంఎస్ పూర్తి చేశారు. 1964లో హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కళాశాలలో జనరల్ సర్జరీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన ఆయన 1969 వరకు అక్కడే సేవలందించారు. అనంతరం ప్లాస్టిక్ సర్జరీపై ఆసక్తితో న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక సఫ్దార్ జంగ్ ఆస్పత్రిలో ఆయన గురువు డాక్టర్ జేఎల్ గుప్తా వద్ద ఆయన ప్లాస్టిక్ సర్జరీలో శిక్షణ తీసుకొని ఎంసీహెచ్ (ప్లాస్టిక్ సర్జరీ) విద్యను పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1972లో తొలిసారిగా ఉస్మానియా ఆస్పత్రిలో ప్లాస్టిక్ సర్జరీ విభాగాన్ని స్థాపించారు. ఈ విభాగం ద్వారా వేలాది మందికి పునర్జన్మనిచ్చే చికిత్సలు అందాయి. అనేక మంది యువ వైద్యులు ఆయన వద్ద శిక్షణ తీసుకున్నారు.
వైద్యుడే కాదు…ప్రకృతి ప్రేమికుడు
ప్లాస్టిక్ సర్జన్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించిన డాక్టర్ ప్రసాద్ ప్రకృతి ప్రేమికుడు. ముఖ్యంగా బోన్సాయ్పై అపారమైన ఆసక్తి ఉండేది. రామోజీ ఫిల్మ్‌సిటీలో బోన్సాయ్ గార్డెన్‌ను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. కాగా, నేడు ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఇంటి వద్దే ఉంచుతారు. అనంతరం మహాప్రస్తానంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.