సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ తీసుకుంటున్న వృద్ధ్దులు, వితంతువులు, వికలాంగులకు సంబంధించి వెరిఫికేషన్లో భాగంగా సోమవారం నుంచి మున్సిపల్, తహసీల్దార్ కార్యాలయాల వద్ద లబ్ధిదారులకు సంబంధించి లైవ్ ఫొటోలను తీసుకునే కార్యక్రమం చేపట్టింది. ఆయా కార్యాలయాల వద్ద ఉదయం నుంచే వివిధ పత్రాలతో వచ్చి క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించిన లబ్ధిదారులు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డారు. కేవలం ఒకే కౌంటర్ ఏర్పాటు చేయడం, టెంట్లు, కుర్చీలు, తాగునీటి సౌకర్యం కల్పించకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల తోపులాట సైతం జరిగింది. వెరిఫికేషన్ జరిగే ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
