నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జనవరి 7(నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లాకు చెందిన కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామానికి చెందిన రైతులపై నమోదైన కేసులో రెండో నిందితుడిగా కొనసాగుతున్న సురేశ్ తరఫున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై మంగళవారం వాదనలు ముగిశాయి. నిందితుడి తరఫున సీనియర్ న్యాయవాది ఏకాంబరం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని ఇంచార్జీ ఏసీబీ కోర్టును కోరారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుర్గాజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిందితుడు లగచర్ల ప్రాంతానికి వెళితే ప్రజలను రెచ్చగొట్టే అవకాశముందని జడ్జీ వాదించగా.. న్యాయవాది బదులిస్తూ.. లగచర్ల గ్రామ పరిసర ప్రాంతాలతోపాటు వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలోని ఏ ప్రాంతానికైనా వెల్లకుండా ఉండేలా నిందితుడిని అదుపు చేసే బాధ్యత తాను తీసుకుంటానని కోర్టుకు హామీ ఇచ్చారు. సుమారు 48 రోజులుగా రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైలులో కొనసాగుతున్నాడని, కోర్టు విధించే షరతులకనుగుణంగా మసలుకునేందుకు నిందితుడు కట్టుబడి ఉంటాడని తెలిపారు. రెండోసారి కూడా సోమవారం నాటితో పోలీసు కస్టడీ ముగిసిందని, కస్టడీ సమయంలో విచారణాధికారికి పూర్తిస్థాయిలో సహకరించాడని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ విచారణకు సహకరిస్తాడని తెలిపారు.