CS Vepa | మేడ్చల్, జూన్ 10: జ్ఞాపకశక్తి నైపుణ్యాలను పెంచుకుంటే జీవితంలో విజయం తథ్యం అని వేప అకాడమీ ఎండీ సీఎస్ వేప అన్నారు. చదువులో విజయం సాధించడానికి మేథాశక్తిని ఎలా వినియోగించాలి? అనే అంశంపై ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రధాన వక్తగా పాల్గొన్న సీఎస్ వేప మాట్లాడుతూ, మేధాశక్తిని సరియైన విధానంలో వినియోగిస్తే కష్టతరమైన విషయాలను కూడా సులువుగా అర్థం చేసుకోవచ్చన్నారు. మేధాశక్తి వినియోగానికి జ్ఞాపక శక్తి నైపుణ్యాలపై పట్టు సాధించాలని సూచించారు.
కొన్ని టెక్నిక్స్‌ను వినియోగించడం ద్వారా విషయ పరిజ్ఞానంపై ఫోకస్ పెరుగుతుందన్నారు. ప్రతి వ్యక్తి తమకు ఉన్న మేధాశక్తిలో అతి తక్కువగా వినియోగిస్తున్నారని తెలిపారు. అందువల్లే విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించలేక జీవితంలో వైఫల్యం చెందుతున్నారన్నారు. విద్యార్థులు ఈ నైపుణ్యాలను ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ సందర్భంగా సీఎస్ వేప ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న వివిధ రకాల జ్ఞాపక శక్తి నైపుణ్యాలను విద్యార్థులకు వివరించారు. వాటిని వినియోగం ద్వారా తక్కువ సమయంలో విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించవచ్చనే విషయాన్ని కూలకశంగా వివరించారు.
కళాశాల కార్యదర్శి టీవీ రెడ్డి మాట్లాడుతూ ఒక విషయం గుర్తు ఉండటానికి, ఉండకపోవటానికి ప్రధాన కారణం దృష్టి పెట్టకపోవడమే అన్నారు. ఏ విషయం అయినా, ఏ వ్యక్తి అయినా ప్రభావం చూపితే ఆ విషయం జీవితాంతం గుర్తుండి పోతుందన్నారు. ఆంగ్ల పదాలు లిజనింగ్, హియరింగ్‌కు తేడా ఉందని తెలిపారు. హియరింగ్ అంటే శబ్ధాన్ని వింటాం కానీ, దాన్ని గుర్తుంచుకోలేమని తెలిపారు. శ్రద్ధతో విన్న విషయం తప్పకుండా గుర్తు ఉంటుందని చెప్పారు. విద్యార్థులు తమ పాఠ్యంశాలపై దృష్టి పెడితే తప్పకుండా పట్టు సాధించగలుతారని చెప్పారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులతో మాట్లాడుతూ పూర్వ ప్రాథమిక విద్య, ప్రాథమిక విద్యను అభ్యసించే సమయంలో గుర్తున్న క్లాస్ టీచర్ల పేర్లు, స్నేహితులు పేర్లు, ఘటనల గురించి అడిగి తెలుసుకున్నారు. దాదాపు 16 ఏండ్ల తర్వాత అప్పటి విషయాలు గుర్తున్నాయంటే వాటి ప్రభావం ఎంతగా ఉందో గుర్తుంచాలన్నారు. విద్యార్థులు ప్రముఖ నిపుణుడు సీఎస్ వేప అందించిన నైపుణ్యాలను చదువులో అమలు చేయాలని ఆయన సూచించారు. కళాశాలలో విద్యార్థులు ఎదగడానికి కావాల్సిన అన్ని రకాల అవకాశాలు, శిక్షణలు ఇస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో జ్ఞాపక శక్తి నైపుణ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించినట్టు చెప్పారు.
ప్రిన్సిపాల్ శ్రీలత మాట్లాడుతూ సదస్సు ద్వారా నేర్చుకున్న విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అవగాహన పొందిన విషయాలను చదువులో అమలు చేయడంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. యువత తన మేధాశక్తి పూర్తి స్థాయిలో వినియోగిస్తే అద్భుతాలు సాధించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆ దిశగా పయనించి, లక్ష్యాన్ని ఛేదించాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌వోడీ సరిత, తెలంగాణ పబ్లికేషన్ ఇనిస్టిట్యూషన్ మేనేజర్ గణేశ్, ఏసీఎం కేఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎస్ వేపను కళాశాల కార్యదర్శి టీవీ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీలత జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు.
వేప అకాడమీ ఎండీ సీఎస్ వేప విద్యార్థులకు కల్పించిన విషయాలు ఎంతో ఉపయోగకరం. చాలా మంది విద్యార్థులు చదువులో వెనుకబడి పోవటానికి ప్రధాన కారణం మేధాశక్తిని సరియైన విధానంలో వినియోగించకపోవడం, ప్రణాళిక లేకపోవడం. లక్ష్యాన్ని సాధించాలంటే ఇంజినీరింగ్‌లో చేరిన మొదటి ఏడాది నుంచే ప్రణాళిక బద్ధ కృషి, విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించే సమయంలో జ్ఞాపశక్తి నైపుణ్యాలు అవసరం. సీఎస్ వేప అందించిన నైపుణ్యాలు, అవగాహన కల్పించిన అంశాలు ప్రభావవంతంగా ఉన్నాయి. విద్యార్థులకు విలువైన విషయాలపై కళాశాలకు వచ్చి అవగాహన కల్పించిన సీఎస్ వేపకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– టీవీ రెడ్డి, కార్యదర్శి సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాల