Crime News | ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూప్ అధినేత వెలమటి చంద్రశేఖర్ జనార్ధన రావును ఆస్తి విషయమై ఆయన కూతురు కొడుకు 73 సార్లు కత్తితో పొడిచాడు. గురువారం రాత్రి సోమాజీగూడలోని చంద్రశేఖర జనార్ధన రావు ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హత్య కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు నిందితుడు కీర్తి తేజ (29)ని శనివారం అరెస్ట్ చేశారు.
పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనార్ధన రావు (86) కొన్నేండ్లుగా సోమాజీగూడలోనే నివసిస్తున్నాడు. ఇటీవలే తన వారసులకు ఆస్తులు పంపిణీ చేసినట్లు తెలుస్తున్నది. ఆస్తుల పంపిణీ విషయమై కిలారు కీర్తి తేజ అసంతృప్తితో ఉన్నాడు. ఇటీవలే తన పెద్ద కూతురు కొడుకు శ్రీకృష్ణను కంపెనీ డైరెక్టర్గా జనార్ధన రావు నియమించాడు. మరోవైపు సరోజినీదేవి కొడుకు కీర్తి తేజ పేరిట రూ.4 కోట్ల విలువైన షేర్లు బదిలీ చేశాడు.
గురువారం సరోజినీదేవి, ఆమె కొడుకు కీర్తి తేజ కలిసి జనార్ధన రావు ఇంటికి వచ్చారు. వారి మధ్య ఆస్తి వివాదంపై చర్చల్లో మాటా మాటా పెరిగింది. వారసత్వ హక్కుల విషయంలో అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ తాతపై మనుమడు కీర్తి తేజ ఆరోపించాడు. ఈ ఘర్షణ పెరిగింది. తల్లి సరోజినీ దేవి టీ, మంచినీరు తేవడానికి కిచెన్లోకి వెళ్లినప్పుడు కీర్తి తేజ తన వెంట తెచ్చుకున్న కత్తితో తాతను 73 సార్లు పొడిచాడు. తండ్రి కేకలు విని బయటకు వచ్చిన సరోజినీ దేవిని కీర్తి తేజ పొడిచాడు. సెక్యూరిటీ గార్డు వీరబాబు అడ్డుకోబోయినా బెదిరించాడు. సరోజినీ దేవికి నాలుగు చోట్ల గాయాలయ్యాయి. అటుపై కీర్తి తేజ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు.
ఈ సంఘటన తెలియగానే ఇతర కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే జనార్ధన రావు మరణించాడు. గాయాలతో బాధ పడుతున్న సరోజినీ దేవిని చికిత్స కోసం ప్రయివేట్ దవాఖానకు తరలించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు నిందితుడు కీర్తి తేజ డ్రగ్ అడిక్ట్ అని అనుమానిస్తున్నారు. అమెరికాలో పీజీ విద్య పూర్తి చేసుకుని ఇటీవలే హైదరాబాద్కు తిరిగి వచ్చాడు. కీర్తి తేజను అరెస్ట్ చేసిన పోలీసులు జనార్ధన రావు ఆస్తి వివాదం, నిందితుడి చరిత్ర గురించి విచారిస్తున్నారు.