సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : జనాభా పెరుగుతోంది. వాహనాలు ఊహించని స్థాయికి చేరుతున్నాయి. ప్రజా రవాణా పడకేసింది. మెరుగైన రవాణా వసతులను కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. ఇంకేముంది ప్రజా రవాణా చతికిల పడుతుంటే వ్యక్తిగత వాహనాల వినియోగం తారా స్థాయికి చేరుతోంది. గడిచిన 13 ఏళ్లలో వాహన వినియోగం, ప్రజా రవాణా వ్యవస్థ, వ్యక్తిగత వాహనాలు, టూ వీలర్, ఫోర్ వీలర్ వంటి అంశాలపై హెచ్ఎండీఏ హుమ్టా సమగ్ర రవాణా ప్రణాళికల పేరిట అధ్యయనం చేసింది. ఈ నివేదిక ప్రకారం నగరంలో వాహన విస్పోటనం జరుగుతుందని తేలింది.
2011-2024 నాటికి నాలుగింతలుగా ఫోర్ వీలర్స్ పెరిగితే, 33 లక్షలు ఉండే ద్విచక్ర వాహనాలు 69లక్షలకు చేరుకున్నట్లుగా వెల్లడైంది. ఇక రవాణా వ్యవస్థకు ఆయువు పట్టులాంటి ప్రజా రవాణా వ్యవస్థలో ఆధునీకరణ లేక వినియోగం క్రమంగా తగ్గిపోతుండటం.. ఢిల్లీ వంటి మహానగరంలో నిత్యం జరిగే వాహన ఇబ్బందుల తరహాలో వాహన విస్పోటనానికి నగరం మరో వేదికగా కానుందని తేలింది. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా కాంప్రెహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ రూపకల్పన అధ్యయనంలో భాగంగా నగరంలో రవాణా అవసరాలను గుర్తించారు.
ఈ స్టడీ ఆధారంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రవాణా వ్యవస్థల ఆధునీకరణ, వ్యక్తిగత వాహనాల వినియోగం వంటి అంశాలను ప్రస్తావించారు. 2011-2024 వరకు నగరంలో మారిన ట్రాన్స్‌పోర్టేషన్ గణాంకాల ఆధారంగా అధ్యయనం చేయగా.. పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో గడిచిన పదమూడేండ్లల్లో ప్రజా రవాణా వ్యవస్థ వినియోగం దారుణంగా పడిపోతుండగా.. సొంత వాహనాల్లోనే నగరవాసులు రాకపోకలు సాగించేందుకు ప్రాధాన్యతనిస్తున్నట్లుగా వెల్లడైంది.
సిటీ బస్సుల వినియోగం పడిపోతుంది. గడిచిన 13ఏళ్లలో 42శాతం నుంచి 25శాతానికి చేరింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య ఏమాత్రం పెరగలేదు. 2011లో 37.6లక్షల మంది ప్రయాణిస్తే… 2024 నాటికి 38లక్షలకు చేరింది. అతితక్కువ మంది మాత్రమే ప్రజా రవాణా వ్యవస్థపై ఆధారపడి ముఖ్యంగా ఆర్టీసీ బస్సులను నమ్ముకుని రాకపోకలు సాగించినట్లుగా నివేదికలో పేర్కొన్నారు. ఎంఎంటీఎస్, మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్యలోనూ ఆశించిన వృద్ధి లేదని, అదే సమయంలో ఆటోల్లో ప్రయాణించే వారి సంఖ్య కూడా తగ్గుతుండగా, ట్యాక్సీలో ప్రయాణించే వారి సంఖ్య మాత్రం పెరిగినట్లుగా తేలింది.
2011లో 33.4లక్షలు మంది ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించగా, 2024 నాటికి ఏకంగా 69.2లక్షలకు చేరింది. ఇక కార్లలో షికారు చేసేందుకు నగర వాసులు మొగ్గుచూపుతుండగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటే సొంత కార్లలో రాకపోకలు సాగించేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. 2011లో 4లక్షలు మంది కార్లలో ప్రయాణించగా 2024 నాటికి 24.3లక్షలకు చేరింది. నగరంలో ఒక్క దశాబ్ద కాలంలోనే వ్యక్తిగత వాహనాల వినియోగం పెరగడంతో ప్రజా రవాణా వ్యవస్థ నిర్వీర్యం అవుతూనే ఉంది.