సిటీబ్యూరో, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ): మద్యం సేవించి వాహనం నడిపేవారు రోడ్డు టెర్రరిస్టులతో సమానమని హైదరాబాద్ సిటీ నూతన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నగరంలో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు.
ప్రజల సంక్షేమం, శ్రేయస్సే ముఖ్యంగా పీపుల్ వెల్ఫేర్ పోలీస్ విధానాన్ని తీసుకువస్తున్నామని, పాత అధికారులు చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే సీపీగా కొత్త సంస్కరణలు తీసుకురావడానికి తన వంతుగా కృషి చేస్తానని వీసీ సజ్జనార్ చెప్పారు. మంగళవారం నగర నూతన సీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు పండుగలు, ఉత్సవాలన్నీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించామని, అదే తరహాలో మత సామరస్యాన్ని కొనసాగిస్తూ నగరంలో ఎలాంటి కమ్యూనల్ గొడవలు కాకుండా చూసుకుంటామని చెప్పారు.
డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్‌పై , రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతామని, పీడీ యాక్టులు పెడతామని సజ్జనార్ హెచ్చరించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో ప్రధాన సమస్య డ్రగ్స్ అని, దీనివల్ల యువత, వారి కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయని చెప్పారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారి కేసులు తిరిగి పరిశీలిస్తామని, నిందితుల డేటాబేస్ తయారు చేస్తామని చెప్పారు. డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇరత రాష్ర్టాల డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్తో సమన్వయం చేసుకుంటామని చెప్పారు.
డ్రగ్స్ విషయంలో ఇప్పుడున్న టీమ్ బాగానే పనిచేస్తున్నదని, అవసరమైతే మరింత సిబ్బందిని కేటాయించి డ్రగ్స్ రవాణాను అరికడతామని చెప్పారు. రోజుకో కొత్తరకం సైబర్ నేరాలు వెలుగుచూస్తున్నాయని, సైబర్ నేరాలను అరికట్టేందుకు హైదరాబాద్ పోలీసులు అనేక చర్యలు చేపట్టారని చెప్పారు.
సైబర్ నేరగాళ్లు ఎక్కువగా వృద్ధులను టార్గెట్ చేసి మోసం చేస్తున్నారన్నారు. సైబర్ నేరాలపై అవగాహన లేక చాలామంది మోసపోతున్నారని, ఓటీపీలు, డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి ఫ్రాడ్లపై నగర ప్రజలు అవగాహన పెంచుకోవాలని, స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో వచ్చే ప్రకటనలు, కాల్స్, సోషల్‌మీడియా యాప్స్‌పై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సజ్జనార్ సూచించారు. డిజిటల్ అరెస్టుల పేరుతో వచ్చే కాల్స్‌ను నమ్మవద్దని సూచించారు.
వీఐపీలు ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోట్ చేయొద్దు
ఆన్లైన్ బెట్టింగ్తో యువత బాగా చెడిపోతున్నదని సజ్జనార్ చెప్పారు. ఈజీమనీ కోసం యువత బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పెట్టి నష్టపోతున్నదని, ఒకకేసులో కొడుకు చనిపోయిన తెల్లవారే తండ్రి కూడా చనిపోయారని.. ఈ కేసు తనను చాలా బాధపెట్టిందన్నారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయవద్దని సోషల్‌మీడియా ఇన్‌ప్లూయర్స్, వీఐపీలను కోరారు. కల్తీ ఆహారంపై ప్రత్యేక దృష్టి పెడతామని, ఇందుకోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి, నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వారు రోడ్ టెర్రరిస్టులు
డ్రంకెన్ డ్రైవర్స్ రోడ్ టెర్రరిస్టులని, వారు సూసైడ్ బాంబ్‌లాంటి వారని సజ్జనార్ పేర్కొన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌పై తనిఖీలు ముమ్మురం చేస్తామని, ఎవరైనా మద్యం తాగి రోడ్లపైకి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎవరైనా డ్రంకర్స్ వాహనం నడుపుతూ ప్రమాదం జరిగితే అమాయకులు బలవుతున్నారని, అటువంటి వారిపట్ల కఠినంగా ఉంటామని చెప్పారు. నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, జీఎస్టీ తగ్గిన తర్వాత వాహనాల కొనుగోళ్లు పెరిగాయని సజ్జనార్ తెలిపారు. ఈ ట్రాఫిక్ సమస్యను తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తామని సీపీ చెప్పారు. సరైన ప్రణాళికతో ప్రజల రోడ్డు సమయం ఆదా చేయడానికి కృషి చేస్తామన్నారు.
సీసీటీవీలు చాలా ముఖ్యమని, నగరంలోని ప్రతీ బిల్డింగ్‌పై సీసీ కెమెరాలు ఉండేలా చేస్తామని సీపీ చెప్పారు. పోలీసుల్లో ఉత్తమంగా విధులు నిర్వర్తించిన వారిని గుర్తించి వారికి రివార్డులు, రికగ్నేజేషన్ కల్పిస్తామని సీపీ చెప్పారు. సివిల్మ్యాటర్తో పాటు ఇల్లీగల్ విషయాల్లో పోలీసులు తలదూరిస్తే కఠిన చర్యలుంటాయని సజ్జనార్ హెచ్చరించారు. ఈ సమావేశంలో అడిషనల్ సీపీ విశ్వప్రసాద్, జాయింట్ సీపీలు జోయల్‌డేవిస్, పరిమళ హనానూతన్, డీసీపీలు అపూర్వరావు, శ్వేత, శిల్పావల్లి, రశ్మిపెరుమాళ్, ధారాకవిత, లావణ్యనాయక్, చంద్రమోహన్, చైతన్యకుమార్, వైవీఎస్ సుధీంద్ర, బాలస్వామి, రాహుల్‌హెగ్డే, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
‘మంగళ’ప్రదమైన రోజు బాధ్యతల స్వీకరణ
మంగళవారం ఉదయం సరిగ్గా 8.28గంటలకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టారు. దుర్గాష్టమి, మంగళవారం మంగళప్రదమైన రోజుగా కర్ణాటక ప్రజలు భావిస్తారు. ఈ క్రమంలోనే దుర్గాష్టమి కూడా కలిసిరావడంతో తన కూతుళ్లతో కలిసి ఐసీసీసీకి వచ్చిన సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. హోం సెక్రటరీగా బదిలీ అయిన పాత సీపీ సీవీ.ఆనంద్.. సజ్జనార్‌ను ఐసీసీసీలో స్వాగతించి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. సర్వమత ప్రార్థనల నడుమ సజ్జనార్ సీపీగా బాధ్యతలు స్వీకరించారు.