సిటీబ్యూరో, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): ఆయన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి కేవలం ఏడాదే పూర్తయింది.. తెలంగాణ సర్కార్ ఆయనను బదిలీ చేస్తూ కీలకమైన హైదరాబాద్ సిటీకి పోలీస్ కమిషనర్‌ను మారుస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సీపీ సీవీ.ఆనంద్ స్థానంలో వీసీ సజ్జనార్‌ను నియమించింది. రాష్ట్రంలోనే కీలకమైన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు కేవలం 20నెలల్లో ముగ్గురు సీపీలను బదిలీ చేయడం ప్రస్తుతం పోలీసుశాఖలో చర్చనీయాంశమైంది. నగరంపై పట్టు సాధించే క్రమంలోనే ప్రాధాన్యత కలిగిన అధికారులను బదిలీ చేయడంతో సిటీలో నేరాలను కట్టడిలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
20నెలల్లో ముగ్గురు కమిషనర్లు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 20నెలల్లో కీలకమైన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్‌కు ముగ్గురు కమిషనర్లను మార్చింది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సాధారణ బదిలీల్లో భాగంగా అప్పటి సీపీ సందీప్ శాండిల్యను బదిలీ చేసి ఆయన స్థానంలో కొత్తకోట శ్రీనివాసరెడ్డిని నియమించారు. గతేడాది సెప్టెంబర్ మొదటివారంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ను నియమించిన ప్రభుత్వం ఏడాది గడిచిందో లేదో ఆయన స్థానంలో ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
ఆనంద్‌ను హోంశాఖ కార్యదర్శిగా నియమించారు. కేవలం తొమ్మిదినెలల్లోనే సీపీ మార్పు అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. అదే సమయంలో రాచకొండ సీపీగా సుధీర్‌బాబు, సైబరాబాద్ సీపీగా అవినాశ్మహంతిలను నియమించింది. అయితే ఈ ఇరవై నెలల్లో ఆ రెండు కమిషనరేట్ల సీపీల స్థానాలు మారకపోయినా హైదరాబాద్ సీపీలు మాత్రం ముగ్గురు మారడంపై చర్చ జరుగుతోంది.
శ్రీనివాసరెడ్డిని నియమించిన తొమ్మిదినెలలకే ఆయనను మార్చడానికి సిటీలో రెగ్యులర్‌గా గొడవలు జరుగుతున్నాయని, క్రైమ్‌రేట్ పెరుగుతుందన్న సాకుతో ప్రభుత్వం ఆ తర్వాత క్రైమ్‌రేట్ తగ్గించే చర్యలు చేపట్టకుండా అధికారుల బదిలీలపైనే దృష్టిపెడుతున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆనంద్ విషయంలో మొదటినుంచి ఆయన డీజీపీ రేసులో ఉన్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆయనకు కాకుండా శివధర్‌రెడ్డికి డీజీపీ బాధ్యతలు ఇవ్వడంపై ఆనంద్ కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయనకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి పోస్ట్ ఇచ్చి ఆయన స్థానంలో వీసీ సజ్జనార్‌ను నియమించారు.
పెరుగుతున్న క్రైమ్‌రేట్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంఘటనలలో అధికభాగం హైదరాబాద్‌లోనే జరుగుతుండడంతో కమిషనరేట్ ఉన్నతాధికారిపై క్రైమ్‌రేట్ తగ్గించే బాధ్యతలుంటాయి. కానీ హైదరాబాద్ నగరంలో గతంతో పోలిస్తే క్రైమ్‌రేట్ విపరీతంగా పెరుగుతోంది. సుమారుగా 20 నుంచి 30శాతం క్రైమ్‌రేట్ పెరిగినట్లు ఓ పోలీస్ అధికారి ఆఫ్ ది రికార్డ్ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన దగ్గరినుంచి లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పిందనే విమర్శలు ఉన్నాయి.
నగరంలో పట్టపగలు హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, స్ట్రీట్‌ఫైట్స్, హ్యుమన్ ట్రాఫికింగ్.. ఇలా ఒకటేమిటి నేరాల విషయంలో జాతీయ, అంతర్జాతీయ నేరగాళ్లకు హైదరాబాద్ వేదికగా మారుతోందనేది పోలీసు రికార్డులే చెబుతున్నాయి. అయితే ఆనంద్ వచ్చిన తర్వాత కమిషనరేట్‌లోని పలు పోలీసు విభాగాల్లో కీలక మార్పులు తీసుకురావడంతో పాటు సైబర్ నేరాలు తగ్గించేందుకు ప్రయత్నించారు.
ఒకవైపు జూబ్లిహిల్స్ ఎన్నికలు, మరోవైపు పెరుగుతున్న సైబర్‌నేరాలు, చిన్నచిన్న వాటికి రోడ్డుపై గొడవలు, సిటీలో కంట్రోల్ తప్పిన లా అండ్ ఆర్డర్ తదితర అంశాలన్నీ కొత్త కమిషనర్‌కు పెద్ద టాస్క్‌గా మారనున్నట్లు ఓ పోలీస్ అధికారి చెప్పారు. ప్రధానంగా ఒక అధికారి కమిషనర్‌గా పనిచేసే క్రమంలో ఆయనకు లోకల్‌గా ఉన్న పరిస్థితులన్నీ అవగాహనకు రావడానికి కొంత టైమ్ పడుతుంది. కానీ రేవంత్ సర్కార్ ఆ అధికారి ఇంకా సీటులో కుదురుకోకముందే బదిలీ చేయడం, వచ్చిన కొత్త అధికారిపై మరింత ఒత్తిడి పెంచుతుందన్న టాక్ పోలీస్‌శాఖలో వినిపిస్తోంది.
నాలుగేళ్ల తర్వాత యూనిఫామ్‌లోకి..!
ఆర్టీసీ ఎండీగా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వీసీ సజ్జనార్‌ను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్రప్రభుత్వప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 2021లో ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ నాలుగేళ్ల తర్వాత పోలీస్ యూనిఫామ్ వేసుకోనున్నారు. 1996బ్యాచ్‌కు చెందిన సజ్జనార్ మొదట ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ కేడర్‌కు కేటాయించారు.
కర్ణాటకలోని హుబ్లీకి చెందిన సజ్జనార్ మొదట జనగామ ఏఎస్పీగా పనిచేసి ఆ తర్వాత పులివెందుల ఏఎస్పీగా, పదోన్నతి తరవాత నల్గొండ, కడప, గుంటూరు, వరంగల్, మెదక్ జిల్లాల్లో ఎస్పీగా సేవలందించారు. సీఐడీలో ఆర్థికనేరాల విభాగం ఎస్పీగా, ఆక్టోపస్ ఎస్పీగా, మంగళగిరి ఆరవ బెటాలియన్ కమాండెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత డీఐజీ, ఐజీగా పదోన్నతులు పొంది 2018వరకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తించారు. ఆగస్ట్ 2021వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా, 2021నుంచి టీఎస్ఆర్టీసీ వైస్‌చైర్మన్, ఎండీగా విధులు నిర్వర్తించారు. తాజా బదిలీల్లో వీసీ సజ్జనార్‌ను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.