మేడ్చల్, సెప్టెంబర్19(నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితాను పూర్తి పారదర్శకంగా రూపొందించాలని విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు వాకాటి కరుణ అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశాపు హాల్లో మంగళవారం కలెక్టర్ అమోయ్‌కుమార్‌తో కలిసి జిల్లాలోని ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ జాబితాపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వాకాటి కరుణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల నుంచి వచ్చిన దరఖాస్తులను నిర్ణీత నమూనా ఫారాలను రిజిష్టర్లలో నమోదు చేయాలని ఆదేశించారు. ఓటర్ నమోదు కార్యక్రమంపై గ్రామాల్లో విస్తృత ప్రచారం, ఇంటింటి సర్వే చేపట్టాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకుల విషయంలో ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు.
అక్టోబర్ 4న తుది ఓటరు జాబితా
అక్టోబర్ 4న తుది ఓటరు జాబితాను ప్రచురించేందుకు అధికారులు పక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అమోయ్‌కుమార్ అన్నారు. జిల్లాలో చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదుతో పాటు రెగ్యులర్‌గా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మంచి స్పందన వస్తుందన్నారు. అక్టోబర్ 1న భారత ఎన్నికల సంఘం అనుమతి మేరకు పూర్తి వివరాలతో సమగ్రమైన తుది ఓటరు జాబితా రూపొందించి 4న ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో డీఆర్వో హరిప్రియ తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్‌లోని హోలిమేరీ కళాశాలలోని ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ నిర్వాహణ, భద్రత ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రాలకు చేరుకునే మార్గంలో తీసుకోవాల్సిన భద్రత చర్యలు, గార్డు వ్యవస్థ గూర్చి అధికారులకు సూచనలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ అధికారులు కలువకుండా పటిష్టమైన బారీకేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మెటల్ బారీకేడ్ వ్యవస్థ యొక్క ప్రయోజనాలు వివరించి, వాటిని ఏర్పాటు చేసేలా ప్రత్యేక సూచనలు ఇచ్చారు.వరుసకు 7 టేబుళ్ల చొప్పున రెండు వరుసల్లో మొత్తం 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఒక్కో నియోజకవర్గానికి 25 రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, 15 ఎకరాల విశాలమైన పార్కింగ్ ప్రాంగణాన్ని కూడా సీపీ పరిశీలించారు. సీపీతో పాటు డీసీపీ గిరిధర్, అదనపు డీసీపీ వెంకటరమణ, కుషాయిగూడ ఏసీపీ వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.