చిక్కడపల్లి, ఫిబ్రవరి 26: వడ్లకొండ కృష్ణ హంతకులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అతని కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఐక్య ఉద్యమ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నందుకు వడ్లకొండ కృష్ణ( మాల బంటి) కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాడుదాం అనే నినాదంతో దళిత బహుజన, మహిళ, విద్యార్థి ప్రజా సంఘాల నేతృత్వంలో బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కుల నిర్మూలనా పోరాట సమితి ( కేఎన్పీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభినవ్ బూరం అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు బి.చెన్నయ్య, డీహెచ్ సీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఏసురత్నం, మారుపాక అనిల్ కుమార్, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి అంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సూర్యపేటలో ఒక భారీ ఆత్మగౌరవ బహిరంగ సభ జరపాలని అన్నారు. ఎస్సీ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అసెంబ్లీ తీర్మానం చేయించే విధంగా వారిపై ఒత్తిడి తెస్తామన్నారు. వడ్ల కొండ కృష్ణ భార్య భార్గవికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వడ్లకొండ కృష్ణ భార్య భార్గవి, తండ్రి డేవిడ్, చైతన్య మహిళా సంఘం నేత జయ, చంద్రప్ప, కేఎన్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సైదులు, స్వరూప, అనూష , ఎండీ వహీద్, డీఎల్ క్రిష్ణ చంద్, శంకర్, వేణు తదితరులు పాల్గొన్నారు.