సిటీ బ్యూరో, నవంబర్ 21(నమస్తే తెలంగాణ): కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కేంద్ర కార్యాలయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే పెద్ద టాస్క్‌గా మారుతున్నది. పీసీబీ అధికారిక కార్యక్రమాలు గోప్యంగా ఉంటున్నాయి. విధుల్లో భాగంగా అధికారులు చేసే పనులు రహస్యంగా ఉంటున్నాయి. పరిశ్రమలు, సంబంధిత కంపెనీల్లో చేపట్టిన తనిఖీలు, వాటి పురోగతి కూడా ప్రజలకు తెలిసే పరిస్థితి లేకుండా తయారైంది. అన్ని ప్రభుత్వ విభాగాల్లో కాలుష్య నియంత్రణ మండలి పాత్ర అత్యంత కీలకమైనది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు, ప్రజలకు పరిశ్రమల వల్ల జరిగే అనార్థాలను అరికట్టడంలో పీసీబీది ప్రముఖమైన పాత్ర. పీసీబీలో ప్రజా సంబంధాల అధికారి లేకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తున్నది. కంపెనీలు, పరిశ్రమల్లో చేసే తనిఖీలను గోప్యంగా ఉంచేందుకే పీఆర్వోను నియమించడం లేదనే టాక్ నడుస్తున్నది.
పీఆర్వో ఉంటే అన్ని విషయాలు బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి.. తమ వైఫల్యాలు బయట పడొద్దనే ఆ పోస్టును ఖాళీగా ఉంచుతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం బయటకు పోవద్దనే ఇలా చేస్తున్నారని పలువురు పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు బహిరంగంగానే చెప్తున్నారు. పౌరులు, సామాజిక కార్యకర్తలు, మీడియా ప్రతినిధులకు రెగ్యులర్‌గా జరిగే తనిఖీలు, సంబంధిత సంస్థలపై తీసుకునే చర్యలను బయటకు చెప్పకుండా ఉంచేందుకు పీఆర్వో పోస్టును ఖాళీగా ఉంచినట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి. 2017లో అప్పటి మెంబర్ సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి డిప్యూటేషన్ మీద ఒక అధికారిని పీఆర్వోగా నియమించారు. మూడేండ్ల డిప్యూటేషన్ పీరియడ్ పూర్తయిన అనంతరం 2021 జనవరిలో ఆ అధికారి తన మాతృ సంస్థకు తిరిగి వెళ్లారు. అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగానే ఉంటున్నది.
ప్రజలు, మీడియాకు సమాచారం చేరవేసేందుకు పౌర సంబంధాల అధికారిగా సోషల్ సీనియర్ సైంటిస్టుకు బాధ్యతలు అప్పగించారు. చిన్న చిన్న కార్యక్రమాలు, ఈవెంట్ల సమాచారాన్ని మాత్రమే ఆయన ప్రజలకు చేరవేయగలుగుతున్నారు. విధుల్లో భాగంగా ఆయన ఎక్కువగా బయట తిరగాల్సి వస్తున్నది. దీంతో కార్యాలయంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. ఆయన అందుబాటులో ఉన్నప్పుడైనా ఏదైనా సమాచారం ఇవ్వాలంటే.. సంబంధిత అధికారులు సహకరించడం లేదనే టాక్ వినిపిస్తున్నది. పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు పరిశ్రమలతో సహా వివిధ సంస్థల్లో జరిగిన తనిఖీలు, కాలుష్యం వల్ల ప్రజల ఇబ్బందులపై ఏదైనా సమాచారం అడిగితే ఏ అధికారి స్పందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.పూర్తి సమాచారం కావాలంటే తప్పని పరిస్థితుల్లో మెంబర్ సెక్రటరీ దగ్గరకే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.