సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): గ్రేటర్‌వాసుల అవసరాలు తీర్చేందుకు సరికొత్త మార్పులతో మై జీహెచ్ఎంసీ యాప్ అందుబాటులోకి వచ్చింది. శానిటేషన్, ఇంజినీరింగ్, హెల్త్, స్ట్రీట్ లైట్, రోడ్స్, డ్రెయిన్ క్లీనింగ్, రోడ్ స్వీపింగ్, తదితర సమస్యలపై ఫొటోగ్రాఫ్లతో పాటు జియో లొకేషన్ ద్వారా ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారికి చేరుతుంది. అంతేకాక ఈ సమస్య పరిష్కారం అయ్యిందో లేదో తెలుసుకోవడంతో పాటు ఫీడ్‌బ్యాక్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ట్రేడ్ లైసెన్స్, ప్రాపర్టీ టాక్స్, భవన నిర్మాణ వ్యర్థాలు తొలగింపునకు వెహికిల్ బుకింగ్ లాంటి సర్వీస్‌లను సింగిల్ క్లిక్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
క్రెడిట్, డెబిట్ కార్డు, యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకునే అవకాశం సైతం ఉంది. వీటితో పాటుగా జీహెచ్ఎంసీ కార్యాలయాల లొకేషన్, వాతావరణ సూచనలు.. ఇలా అనేక సేవలు క్షణాల్లో పొందవచ్చని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. మై జీహెచ్ఎంసీ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్లోని ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని సమస్యలు, సేవలు పొందవచ్చునని కమిషనర్ సూచించారు. లొకేట్ వార్డు ఆఫీస్ ఆప్షన్‌లోకి వెళ్తే జీహెచ్ఎంసీ ఆఫీసుల లొకేషన్ తెలుసుకోవచ్చన్నారు. ట్రేడ్, పెట్ డాగ్ లైసెన్స్‌ను ఫ్యూ క్లిక్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. నగర పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.