ఉప్పల్, ఫిబ్రవరి 24 : హత్య కేసులో నలుగురు నిందితులను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి..రిమాండ్‌కు తరలించారు. ఉప్పల్ వెలుగుగుట్ట రోడ్డులో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆదర్శనగర్‌కు చెందిన సాయికుమార్‌ను కత్తితో పొడిచి పరారయ్యారు. చికిత్స పొందుతూ సాయికుమార్ మృతిచెందాడు. కేసు నమోదు చేసుకొని..దర్యాప్తు చేసిన పోలీసులు లైంగిక వేధింపు నేపథ్యంలోనే హత్య జరిగినట్లు తేల్చారు. ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో మల్కాజిగిరి డీసీపీ పద్మజ వివరాలను వెల్లడించారు. ఉప్పల్ రాఘవేంద్రనగర్ కాలనీలో ఉండే మహిళ ఇద్దరు ఆడపిల్లలతో కలిసి నివాసముంటున్నారు.
ఈ క్రమంలో సాయికుమార్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నట్లు గతంలోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి రిమాండ్‌కు కూడా తరలించారు. అయినా సాయికుమార్ వేధింపులు కొనసాగుతుండటంతో సదరు మహిళ తెలిసిన బంధువు దీపక్‌కుమార్‌ను సంప్రదించారు. అతడు తన స్నేహితుడైన బాలకృష్ణతో కలిసి సాయికుమార్ అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 20న మాట్లాడేది ఉందంటూ.. అతడిని ఉప్పల్ క్రికెట్ స్టేడియం జెన్పాక్ట్ రోడ్డులోకి పిలిచారు. సదరు మహిళ కుమార్తె కారం పొడి చల్లగా.. మిగతా ఇద్దరు సాయికుమార్‌పై కత్తితో పొడిచి చేసి చంపేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఉప్పల్ మండే మార్కెట్లో నిందితులు కత్తిని కొనుగోలు చేసినట్లు తేల్చారు. దీపక్‌కుమార్, శివాణి, బాలకృష్ణతోపాటు సదరు మహిళను హత్య కేసులో నిందితులుగా గుర్తించి..అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.