సిటీబ్యూరో, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): ఒక ఘటనలో తల… మరో ఘటనలో మొండెం.. ఇంకో ఘటనలో శరీర భాగాలు లేకుండా నిందితులు హత్యలకు పాల్పడ్డారు. ఆయా ఘటనలలో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు, వారికి శిక్షలు పడే విధంగా చేయడమే ఇప్పుడు సవాల్‌గా మారింది. హత్యలు చేసిన నిందితులు ముందస్తు ప్లాన్ ప్రకారం.. శరీర భాగాల ఆధారాలు లభించకుండా చేసి, చట్టానికి దొరకకుండా ప్రయత్నించారు. అయితే ఆయా కేసులలో పోలీసులు శాస్త్రీయ ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. 2018లో ఉప్పల్‌లో జరిగిన పసిపాప నరబలి… 2025లో మీర్పేట్లో భార్యను హత్య చేసి ఆమె శరీర భాగాల ఆనవాళ్లు లేకుండా కాల్చేసిన భర్త… ఇటీవల మేడిపల్లిలో భార్యను దారుణంగా హత్య చేసి ఆమె తల, చేతులు, కాళ్లు మూసీలో పడేసిన కేసులలో సాంకేతిక సహాయం తీసుకొని నిందితులను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయా కేసులలో నిందితులకు శిక్షలు పడేందుకు కావాల్సిన సాక్ష్యాలను పకడ్బందీగా పోలీసులు కోర్టు ముందుంచాల్సిన అవసరముంది. ఈ కేసులు పోలీసులకు సవాల్‌గా మారనున్నాయి. చట్టం నుంచి తప్పించుకోవడంలో భాగంగానే నిందితులు ముందస్తు ప్రణాళికలతో ఈ హత్యలు చేశారు.. ఆయా కేసులలో లభించిన ఆధారాలతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
2018 ఫిబ్రవరిలో ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిలుకానగర్‌లో ఓ చిన్నారి తల టెర్రస్‌పై గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో తలను మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, మొండెం కోసం పోలీసులు ఎన్నో చోట్ల వెతికారు. అయినా లాభం లేకుండా పోయింది. తల దొరికిన చోట అనుమానితుల ఇంట్లో రక్తపు నమూనాలను సేకరించి వాటిని విశ్లేషించారు. బ్లూ రే టెక్నాలజీతో సేకరించిన ఈ ఆధారాలతో రెండు చోట్ల లభించిన రక్తపు నమునాలు ఒకటేనని పోలీసుల విచారణలో తేలింది. దీంతో క్యాబ్ డ్రైవర్ అయిన రాజశేఖర్, ఆయన భార్యను పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేశారు. నిందితుడు రాజశేఖర్ తన భార్య ఆరోగ్యం బాగు చేసుకోవాలనే మూఢనమ్మకంతో సికింద్రాబాద్‌లోని బోయిగూడ ప్రాంతం నుంచి పుట్‌పాత్‌పై పడుకున్న పసిపాపను అపహరించి తీసుకొచ్చాడు. అదే రోజు రాత్రి పసిపాప తలను కోసి, మొండాన్ని ప్రతాపసింగారం వద్ద మూసీలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. గ్రహణం సందర్భంగా క్షుద్రపూజలు చేశాడని, అందులో భాగంగానే పసిపాపను హత్య చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చి, రాజశేఖర్ అతని భార్యను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొండెం లభించలేదు, కేవలం తల మాత్రమే దొరికింది.
2025 జనవరిలో సంక్రాంతి పండుగ రోజు మీర్పేట్లో దారుణం చోటు చేసుకుంది. రిటైర్డు ఆర్మీ ఉద్యోగి అయిన గురుమూర్తి, తన భార్య మాధవిని హత్య చేశాడు, ఆ తరువాత ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఉడకబెట్టాడు.. శరీర భాగాల అనవాళ్లు లేకుండా.. కొన్ని చెరువులో.. మరికొన్ని ఉడికించి దానిని మెత్తగా చేసి బాత్రూంలో పరబోశాడు.. ఆ తరువాత ఆమె కన్పించడం లేదంటూ మాధవి కుటుంబ సభ్యులతో కలిసి మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు… అతని వ్యవహారంపై అనుమానం వచ్చిన మాధవి కుటుంబ సభ్యులు పోలీసుల వద్ద పలు సందేహాలు వ్యక్తంచేశారు.. దీంతో భర్తే ఏదో చేశాడనే అనుమానంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయట పడింది. సాంకేతిక పరిజ్ఞానంతో ఇంట్లో మాధవిని హత్య చేసిన చోట రక్తపునమునాలను సేకరించి, మాధవిని హతమార్చినట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు గురుమూర్తిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మాధవి మృతదేహానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించికుండా ఉండేలా గురుమూర్తి ప్లాన్ చేశాడు. అయితే పోలీసులు మాత్రం ఘటన స్థలంలో పలు ఆధారాలు సేకరించారు, వాటిని విశ్లేషించి, నిందితుడు గురుమూర్తే హంతకుడని తేల్చి అరెస్ట్ చేశారు.
మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల ప్రేమించి పెండ్లి చేసుకున్న స్వాతిని ఆమె భర్త మహేందర్‌రెడ్డి దారుణంగా హతమార్చాడు. ఆమెను హత్య చేసి అనంతరం ఆమె శరీర భాగాలను రంపంతో కోసేశాడు. తల, చేతులు, కాళ్లు వేరు చేసి వాటిని ప్రతాపసింగారం వద్ద మూసీలో పడేశాడు. ఇంట్లో మొండెం ఉంచి బయటకు వెళ్లి స్వాతి కన్పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు అనుమానం వచ్చి మొదట ఇంట్లోనే తనిఖీ చేయగా ఆమె మొండెం లభించడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ కూడా పోలీసులు శాస్త్రీయ ఆధారాలను సేకరించి, నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మూడు కేసులలో హత్య చేసిన అనంతరం ఆ మృతదేహాలను మాయం చేసేందుకు నిందితులు ప్రయత్నించారు. ఈ కేసులలో నిందితులకు కఠిన శిక్షలు వేయిస్తేనే, భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు జరగకుండా, ఇలాంటి ఆలోచనలు చేయకుండా సమాజానికి గుణపాఠంగా మారుతుంది. ఘటనలు జరిగినప్పుడు పరిస్థితులు, మూడునాలుగేండ్ల తరువాత ఆయా కేసులలో సాక్ష్యాలను నిరూపించే సమయంలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. దీంతో ఈ మూడు కేసులను ఇప్పుడు రాచకొండ పోలీసులు సవాల్‌గా తీసుకొని నిందితులకు పక్కాగా కఠిన శిక్షలు వేయించాల్సిన అవసరముంది.