జీహెచ్ఎంసీ ఆదాయానికి గండి కొడుతూ, నిబంధనలను తుంగలో తొక్కి కొందరు బడా బాబులు అక్రమ ప్రకటనల దందాకు తెరలేపారు.. ఎటువంటి టెండర్లు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనల బోర్డులను ఏర్పాటు చేసుకుని నెలకు రూ. అరకోటికి పైగా జీహెచ్ఎంసీ ఖజానాకు గండి కొడుతున్నారు. నగరం నడిబొడ్డున అత్యంత కీలకమైన కేబీఆర్ పార్క్ చుట్టూ లాలీపాప్ బోర్డులతో జీహెచ్ఎంసీని ‘టార్గెట్’గా చేసుకుని దందాకు పాల్పడుతున్న ‘ముఖ్య’నేత సోదరుడి తీరు చర్చనీయాంశమైంది.
వీవీఐపీ కారిడార్లో బరి తెగించి మరీ..కమర్షియల్ వ్యాపారాలు చేస్తున్నారు. తన పరపతిని ఉపయోగించి ఈ అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్న తీరు అటు బల్దియా, ఇటు ఔట్డోర్ మీడియా ఏజెన్సీలలో చర్చ జరుగుతున్నది. కేబీఆర్ పార్కు చుట్టూ జీహెచ్ఎంసీకి సంబంధినవి బోర్డులను స్వయంగా అధికారులు బహిరంగ ప్రకటన చేసినప్పటికీ.. యథేచ్ఛగా స్వాధీనం చేసుకుని..ఆపై ప్రభుత్వానికి చిల్లిగవ్వ ఇవ్వకుండా దౌర్జన్యంగా ఏటా రూ. కోట్లాది రూపాయల పబ్లిక్ మనీని దారి మళ్లిస్తుండడం గమనార్హం.
సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ) : సాధారణంగా ప్రభుత్వానికి రావాల్సిన ఫీజులు చెల్లించి, అనుమతి పొందిన తర్వాతనే ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.. కానీ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న దాదాపు 300ల లాలీపాప్స్ బోర్డులు అనధికారికంగా ముఖ్యనేత సోదరుడి చేతిలోకి వెళ్లాయి. సదరు ప్రైవేట్ వ్యక్తి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా.. కనీసం టెండర్ లేకుండానే ఒక్కో బోర్డు నుంచి నెలకు రూ. 20వేల చొప్పున మొత్తం రూ. 60 లక్షల మేర పబ్లిక్ మనీని పక్కదారి పట్టిస్తున్నారు.
అంటే ఏటా రూ. 7.20 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండిపడుతున్నది. వాస్తవంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న లాలీపాప్స్ బోర్డులను జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకున్నది. ఇక మీదట ఏజెన్సీలకు ఇచ్చేది లేదని, స్వయంగా జీహెచ్ఎంసీ ద్వారా ప్రకటనల ఫీజులతో సంస్థ ఖజానాను బలోపేతం చేస్తామని సంబంధిత లాలీపాప్స్పై బహిరంగ ప్రకటనలు చేశారు..కానీ కేవలం వారం వ్యవధిలోనే సదరు ముఖ్యనేత సోదరుడు అధికారులపై ఒత్తిడి పెంచి వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని లాలీపాప్స్తో కమర్షియల్ వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలు దారి మళ్లిస్తున్నాడు. ఇదేమని ప్రశ్నించిన అధికారులకు బదిలీ చేస్తున్నట్లు టాక్ ఉంది.
అధికారుల మౌనంపై అనుమానాలెన్నో!
ఈ అనధికారిక లాలీపాప్స్ ప్రకటన వ్యవహారంపై ఫిర్యాదులు అందుతున్నా, క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు మాత్రం కిమ్మనకుండా మౌనం వహిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ‘కళ్ళెదుటే వందల బోర్డులు కనిపిస్తున్నా’ చూసీ చూడనట్లు నటిస్తున్నారంటే, ఇందులో అధికారుల వాటా కూడా ఉందా?’ అనుమానాలు లేకపోలేదు. వీవీఐపీలు తిరిగే ప్రాంతంలో ఇంత బహిరంగంగా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా, యాడ్ వింగ్ అధికారులు నోరు మెదపకపోవడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వతహాగా హ్యాండోవర్ చేసుకున్నట్లు ప్రకటించి..ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తికి జీ హుజుర్ అనడంపై సమంజసం కాదని ప్రశ్నిస్తున్నారు. టెండర్లు పిలిచి పారదర్శకతకు పెద్ద పీట వేయాలని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ అక్రమ దందాపై విచారణ జరిపి, అక్రమ బోర్డులను తొలగించడమే కాకుండా, ఖజానాకు జరిగిన నష్టాన్ని సదరు వ్యక్తి నుంచి వసూలు చేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.