మేడ్చల్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి నిధులు మంజూరు కాకపోవడంతో విదేశాలలో చదువుకుంటున్న ఎస్సీ విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. 2వ సెమిస్టర్ ఫీజుల చెల్లింపులకు సంబంధించి విద్యార్థుల ఖాతాల్లో నగదు ఇప్పటికీ జమ కాలేదు. 2వ సెమిస్టర్ ఫీజులకు సంబంధించి సంబంధిత షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ నుంచి వివరాలను పంపించినప్పటికీ ఆర్థికశాఖ నుంచి క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఫీజుల చెల్లింపు జరగలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి ఎంపికైన విద్యార్థులు.. విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్తారు.
వారి చదువుకు అవసరమయ్యే రూ.20 లక్షలను ప్రభుత్వం అందిస్తుంది. సెమిస్టర్ల వారీగా నిధులను అందించాల్సి ఉండగా గత సంవత్సరం మార్చి నెలలో నిధులు రాగా మొదటి సెమిస్టర్‌కు ఫీజులు చెల్లించారు. రెండవ సెమిస్టర్‌కు ఇప్పటివరకు ఫీజలకు సంబంధించిన నిధులు మంజూరు కాలేదు.మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి 2024-25 విద్యా సంవత్సరానికి గాను 72 మంది ఎస్సీ విద్యార్థులు ఈ పథకం ద్వారా విదేశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వందలాది సంఖ్యలో ఎస్సీ విద్యార్థులు వెళ్లిన ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విదేశీ విద్యార్థులను పట్టించుకోవడం లేదని వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
నిద్రావస్థలో సెలక్షన్ కమిటీ..!
అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు విదేశీ విద్యకు విద్యార్థులను సెలక్ట్ చేయలేదు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి అంబేద్కర్ విద్యా విదేశీ పథకానికి అర్హత ఉన్న 32 మంది విద్యార్థులు జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అభివృద్ధి శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారుల వివరాలను జిల్లా నుంచి ఎస్సీ కమిషనరేట్ కార్యాలయానికి సమర్పించినా ఇప్పటివరకు సెలక్షన్ చేయకపోవడంతో వివిధ దేశాలలో విద్యా సంవత్సరం ఆగస్టు నెలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో సమయం తక్కువగా ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో అంబేద్కర్ విదేశీ విద్య అమలవుతుందా లేదా అన్న సందేహలను ఎస్సీ విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు.