దొంగలు తెలివిమీరారు.. ఏటీఎం
మిషన్నే కన్ప్యూజ్ చేస్తున్నారు. సాంకేతిక సమస్య సృష్టించి డబ్బులు నొక్కేస్తున్నారు. కాని ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని రశీదు రావడంతో పాటు స్క్రీన్‌పై చూపుతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని తమకు డబ్బులు రాలేవని బ్యాంకు నుంచి మరల డబ్బులు నొక్కేస్తున్నారు. హర్యానాకు చెందిన ఓ ముఠా రెండేళ్లుగా ఈ తరహా మోసాలకు పాల్పడుతూ లక్షలాది రూపాయలను బ్యాంక్‌ల నుంచి దర్జాగా కొట్టేస్తుంది. ఓ బ్యాంక్ సిబ్బందికి వచ్చిన అనుమానంతో ముఠా భాగోతం బయటపడింది. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో
సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.
మోసానికి ఆ 30 సెకన్లు
ఏటీఎం మిషన్‌లో గందరగోళం సృష్టించి డబ్బులు కాజేస్తున్న ముఠా సభ్యులు కీలకమైన 30 సెకన్ల సమయంలో అప్రమత్తంగా ఉంటారు. సెక్యూరిటీ సిబ్బంది ఉండని ఎస్బీఐ ఏటీఎం కేంద్రాలను ఎంచుకుని ఉదయం 6 నుంచి 10 గంటల సమయంలో చోరీ చేస్తారు. చోరీ చేసే సమయంలో ఇద్దరు లోపల, ఇద్దరు బయట ఉంటారు. పిన్ నొక్కగానే డబ్బులు బయటకు వస్తాయి. ఇలా రిలీజ్ అయిన నగదును తీసుకోకపోతే 30 సెకన్ల తర్వాత వెనక్కి వెళ్తుంది. వెనక్కి వెళ్లే సమయంలో డబ్బులు పట్టేసుకుంటారు. లేదా పవర్ ఆఫ్ చేస్తారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.