మేడ్చల్, జూలై 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు అరకోరగా అమలవుతున్నాయి. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రారంభమైన మహాలక్ష్మి పథకంలో సబ్సిడీ గ్యాస్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అందడం లేదు. మహాలక్ష్మి పథకం లబ్ధిదారులు సబ్సిడీ కోసం ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహాలక్ష్మి పథకంలో రూ. 500కే పథకాన్ని అమలు చేయాలని పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది.
పథకం ప్రారంభమైన కొన్ని నెలలు మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో రాయితీ నగదును జమ చేశారు. గత మార్చి నెల నుంచి జూన్ వరకు రాయితీ గ్యాస్ నగదు జమ కాలేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో కొంత మందికే రాయితీ వచ్చిందని మిగతా లబ్ధిదారులకు నగదు జమ కాలేదని తెలుస్తోంది. దీంతో లబ్ధిదారులు పథకం ప్రారంభించిన మహిళలకు ఒరిగింది ఏమీ లేదని వాపోతున్నారు. సబ్సిడీ గ్యాస్ విషయమై అధికారులను సంప్రదిస్తే తమకు రాయితీ గ్యాస్‌పై ఎలాంటి సమాచారం ఉండదని అధికారులు పేర్కొనడం గమనార్హం. మహాలక్ష్మి పథకం లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందడం లేదన్న ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
రాయితీ లబ్ధిదారులు 1,90,900
మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవరాల్లో మహాలక్ష్మి పథకం కింద 1,90,900 మంది లబ్ధిదారులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 6,11,118 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసి రెండు మూడు నెలలు మాత్రమే రాయితీ గ్యాస్‌ను అందించినట్లు లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ. 874 ఉండగా, ప్రభుత్వం అందించే రాయితీ గ్యాస్ కొంత మేరకు లభించిన ఉరట కొన్ని నెలలు మాత్రమే ఉందంటున్నారు. ప్రజలకు హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం దృష్టి సారించి ఎంపిక చేసిన లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా చూడాలని మహిళలు కోరుతున్నారు.
దృష్టి సారించని సర్కారు..
కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ప్రారంభించడమే తప్ప అమలుపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ పథకం, రేషన్ కార్డుల జారీలో అలసత్వం వహిస్తున్నట్లు ఆన్ని వర్గాల ప్రజలు ఆరోపిస్తున్నారు.