Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 6: ప్రభుత్వ, అధికార యంత్రాంగ విరుద్ధమైన పోకడలు, వింతైన పాలనా తీరుతో ఉస్మానియా యూనివర్సిటీ ఔన్నత్యానికి చెద పట్టేలా ఉన్నది. ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ ప్రభ అధికారుల నిర్లక్ష్యంతో క్రమేణా మసకబారుతోంది. అధికారుల నిర్ణయాలు ఇప్పటికే కొన్ని వివాదాస్పదమవడంతో పాటు విద్యార్థుల ఆందోళనలతో వార్తల్లోకెక్కాయి. తాజాగా రెండు రోజుల నుంచి ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచి వెబ్సైట్ http://ouexams.in పనిచేయడం లేదు. ‘దిస్ డొమైన్ నేమ్ ఎక్స్పైర్డ్’అనే సందేశం కనిపిస్తోంది. రెండు రోజులు గడిచినా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, వెబ్సైట్ను పునరుద్ధరించాలని విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫోన్ లైన్లో అందుబాటులోకి రాలేదు.
నిలిచిపోయిన పలు రకాల సేవలు
అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతికత నేపథ్యంలో కీలకమైన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచికి సంబంధించిన అన్ని సేవలు వెబ్సైట్ ఆధారంగానే కొనసాగుతున్నాయి. సాధారణంగా విద్యార్థులకు ఎటువంటి సర్టిఫికెట్లు అవసరమైనా వెబ్సైట్ ద్వారానే నియమిత రుసుము చెల్లించడంతో పాటు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ తెరుచుకోకపోవడంతో ఈ సేవలన్నీ నిలిచిపోయాయి. పరీక్షా ఫీజుల స్వీకరణ, గడువుల పొడగింపు, పరీక్షా తేదీల ఖరారు, పరీక్షా ఫలితాల విడుదల తదితర అన్ని అంశాల నోటిఫికేషన్లు సైతం ఆ వెబ్సైట్లోనే అందుబాటులో ఉంటాయి. దీంతో విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన ఎటువంటి సమాచారం లేకపోవడంతో తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.
పదవీ విరమణ చేసి ఏండ్లు గడిచినా…
ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ www.osmania.ac.in సైతం తప్పుల తడకగా మారిపోయింది. అధికారుల నిర్లక్ష్య వైఖరితో వెబ్సైట్ను సందర్శించే వాళ్లు ముక్కున వేలేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. వర్సిటీకి సంబంధించిన సమస్త సమాచారం, జరుగనున్న సదస్సులు, ఇతర నోటిఫికేషన్లు తదితర అన్ని వివరాలు వెబ్సైట్లో ఉంచాల్సిన అధికారులు అది తమ పనే కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. వర్సిటీలో వివిధ పరిపాలనాపరమైన పదవుల్లో కొత్తవారు విధుల్లో చేరినప్పటికీ, వెబ్సైట్లో మాత్రం పాత వారి పేర్లే దర్శనమిస్తున్నాయి. కొంత మంది ప్రొఫెసర్లు పదవీ విరమణ చేసి కొన్నేండ్లు గడుస్తున్నా ఇంకా పదవుల్లో కొనసాగుతున్నట్లే వెబ్సైట్లో చూపించడం గమనార్హం.