సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ఖరీదైన కార్లే వారి టార్గెట్.. సెన్సర్ లాక్‌ను డీ కోడ్ చేసి, కార్లను అన్‌లాక్ చేస్తారు. కార్ల లాక్ తీసి దర్జాగా అపహరిస్తారు. ఆ తర్వాత వాటి నంబర్ ప్లేట్‌తో పాటు ఇంజిన్ నంబర్, ఛేసిస్ నంబర్లను మార్చేస్తారు. ఆ వాహనాలకు ఇతర రాష్ర్టాలకు చెందిన నకిలీ నంబర్ ప్లేట్లను అమర్చి.. ఆయా రాష్ర్టాల్లోని సెకండ్ హ్యాండ్ కార్ల డీలర్లకు అతి తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటారు. ఇలా.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 కార్లను నగరంలోని డీలర్లకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా వాహనాల చోరీకి పాల్పడుతూ.. ఒక రాష్ట్రంలో దొంగిలించిన కారును మరో రాష్ట్రంలో విక్రయించడం ఈ ముఠా ప్రత్యేకత. ఇటీవల ఇద్దరు నిందితులు మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో దొంగిలించిన కారులో వెళ్తూ రాజేంద్రనగర్ ఎస్ఓటీ, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు పట్టుబడ్డారు. వారిని విచారించగా ఏడుగురు సభ్యులతో కూడిన ఈ ముఠా వెలుగులోకి వచ్చింది.
సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బుధవారం క్రైమ్ డీసీపీ కల్మేశ్వర్, రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ పి.మధులతో కలిసి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. కోల్‌కతా ప్రాంతానికి చెందిన భప్పగోష్ అలియాస్ సోనూ గోష్ తన అనుచరులైన యూపీకి చెందిన సాజద్ ఖాన్, ఢిల్లీకి చెందిన పర్వాజ్, షషిర్ ధలాల్, అభిషేక్ కుమార్, కోల్కత్తకు చెందిన జకీర్, అరుణ్ బంగానీ ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఢిల్లీ, పుణె, హర్యానా.. వాటి పొరుగు రాష్ర్టాల్లో ఖరీదైన కార్లను లక్ష్యంగా చేసుకుని వాహనాలను దొంగిలిస్తున్నారు. ఖరీదైన కార్ల సెన్సర్ లాక్స్‌ను డీ కోడ్ చేసి.. కార్ల తాళాలు తీసి, వాహనాలను అపహరిస్తున్నారు. దొంగిలించిన కార్ల ఇంజిన్ నంబర్‌తో పాటు చేసిన్ నంబర్, నంబర్ ప్లేట్లను మార్చివేశారు. ఆ తరువాత తెలంగాణ, మహారాష్ట్ర, అసోం, యూపీ తదితర రాష్ర్టాలకు చెందిన నంబర్లతో నంబర్ ప్లేట్లను అమర్చి, ఆ నంబర్ ప్లేట్ల ఆధారంగా ఆయా రాష్ర్టాల్లోని సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే డీలర్లకు తక్కువ ధరకే విక్రయిస్తారు.
ఈ క్రమంలోనే తన అనుచరులైన అషబుల్ మండల్, అక్షయ్ ద్వారా హైదరాబాద్, మైలార్‌దేవ్‌పల్లికి చెందిన సెకండ్ హ్యాండ్ కార్ల డీలర్ మక్కి ఉర్ రహ్మాన్‌కు రెండు కార్లు, నిజాంపేట, మేడ్చల్‌కు చెందిన కడియం శ్రీనివాస్‌రావుకు 7 కార్లను విక్రయించారు. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సమీర్ అహ్మద్(51), పశ్చిమ బెంగాల్‌కు చెందిన అషబుల్ మండల్ (24) ఈనెల 8న ఆరాంఘర్ చౌరస్తా మీదుగా క్రిటా కారులో వెళ్తుండగా.. విశ్వసనీయ సమాచారం మేరకు రాజేంద్రనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ మధు తమ సిబ్బందితో కలిసి పరివార్ దాబా వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వీరి విచారణలో భప్ప గోష్ చోరీ భాగోతం బయటపడింది. నిందితులిచ్చిన సమాచారం మేరకు దొంగ కార్లను కొనుగోలు చేసి, నగరంలో విక్రయిస్తున్న మక్కి ఉర్ రహ్మాన్, కడియం శ్రీనివాసరావుతో పాటు యూపీకి చెందిన ఆశీష్ సూద్, అక్షయ్, ఆకాశ్ సూద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రూ.3.3 కోట్ల విలువజేసే 11 కార్లతోపాటు నకిలీ ఆర్సీలు, ఎన్ఓసీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులైన భప్పగోష్, సాజద్ ఖాన్, పర్వాజ్, షషీర్ దలాల్, జకీర్, అరుణ్ బంగాని, అభిషేక్ కుమార్ పరారీలో ఉన్నారు. చాకచక్యంగా వ్యవహరించి ఈ ముఠాను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా సీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందించి, రివార్డులు ప్రకటించారు.