మన్సూరాబాద్, డిసెంబర్ 22: ఖనిజాల అన్వేషణకు నూతన సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉందని కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు తెలిపారు. శుక్రవారం ఖనిజాల అన్వేషణలో కొత్త సాంకేతికత అనే అంశంపై నాగోల్ బండ్లగూడలోని భారతీయ భూవైజ్ఞానిక సర్వే శిక్షణా సంస్థ (జీఎస్ఐటీఐ) ప్రాంగణంలోని ఎంఎస్ కృష్ణన్ ఆడిటోరియంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వీఎల్. కాంతారావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ఖనిజాల అన్వేషణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మిషిన్ లెర్నింగ్ (ఎంఎల్) ఉపయోగించాల్సిన అవసరం ఉందన్నారు. పీఎస్యూలు, ప్రైవేటు వాటాదారులు జీఎస్ఐకి సంబంధించిన నేషనల్ జియో సైన్స్ డేటా రిపోజిటరీ (ఎన్జీడీఆర్) నుంచి జియో సైంటిఫిక్ డేటాను తీసుకుని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీఎస్ఐ డైరెక్టర్ జనరల్ జనార్దన్ ప్రసాద్, జీఎస్ఐ ఏడీజీ, హెచ్ఓడీ సీహెచ్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.