కాచిగూడ : కులగణన చేపడితే సమాజ విభజన జరుగుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ(Union Minister Gadkari) ప్రకటించడం సిగ్గుచేటని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ( R.Krishnaiah) డిమాండ్ చేశారు. శనివారం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన కాచిగూడలో నిర్వహించిన బీసీ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్ర మంత్రి తక్షణమే 70 కోట్ల మంది బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కులాల వారీగా జనాభా లెక్కలు తీసి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతం వరకు పెంచాలని తెలిపారు. విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్లను 25 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చిన బీసీల డిమాండ్లను వెంటనే అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ,నీలం వెంకటేశ్,కోట్ల శ్రీనివాస్, సుధాకర్,మధుసూదన్, రామకృష్ణ, పృద్వీగౌడ్, బలరామ్, కమలాకర్,లడ్డూపటేల్, కరుణశ్రీ, కోటీశ్వరి,నందగోపాల్ పాల్గొన్నారు.