సిటీబ్యూరో/ఉస్మానియా యూనివర్సిటీ/ఖైరతాబాద్/చిక్కడపల్లి, జూలై 15 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలతో నగరం అట్టుడుకుతున్నది. పోలీసులు నిరుద్యోగులను ఎక్కడికక్కడే నిర్బంధిస్తున్నారు. నిరసన తెలుపుతున్న వారిపై విచక్షణ రహితంగా లాఠీచార్జీ చేస్తున్నారు. డీఎస్సీ వాయిదా, గ్రూప్1, గ్రూప్ 2, గ్రూప్ 2 పోస్టులను పెంచాలనే డిమాండ్లతో కొన్ని రోజులుగా నిరుద్యోగులు నిరసన తెలుపుతున్నా.. ప్రభుత్వం దిగిరావడం లేదు.
దీంతో సోమవారం సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే ఆందోళనలు భగ్నం చేసేందుకు పోలీసులు ఎక్కడికక్కడే నిరుద్యోగులను కట్టడి చేశారు. అశోక్‌నగర్, చిక్కడపల్లి, ఇందిరాపార్కు, ఉస్మానియా యూనివర్సిటీ, దిల్సుఖ్నగర్ పరిసర ప్రాంతాల్లో యువతను తెల్లవారుజాము నుంచే పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. నిరుద్యోగ యువతను పోలీసులు అరెస్టు చేశారు. అడ్డొచ్చిన వారిపై లాఠీలు ఝళిపించారు.
చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిరుద్యోగ యువకులు మరోసారి మెరుపు సమ్మెకు దిగారు. భారీ సంఖ్యలో హాజరైన యువకులు ర్యాలీగా బయలుదేరేందుకు ప్రయత్నిస్తుండడంతో పోలీసులు అడ్డుకున్నారు. లైబ్రరీ గేట్లు వేసి వారిని బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు యువకులు తమ నిరసన వ్యక్తం చేస్తామంటూ గేట్ల తాళాలు తొలగించుకొని బయటకు వచ్చారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.