సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): కాచిగూడ-నింబోలిఅడ్డా.. అత్యంత రద్దీ ఉండే ఈ మార్గంలో పైపులైన్ వేయాలంటే అంత సాధ్యం కాదు. అందులో 1800 ఎంఎం డయా భారీ పైపులైన్ వేయాలంటే అత్యంత కష్టం. ఇక్కడే జలమండలి అధికారులు ట్రెంచ్‌లెస్ టెక్నాలజీతో కాచిగూడ-నింబోలిఅడ్డా వరకు దాదాపు ఐదు కిలోమీటర్ల మేర భూ సొరంగ డ్రైనేజీ పనులు చేపట్టారు. అయితే రాళ్లను తొలగించడంలో తరచూ ఏర్పడిన సాంకేతిక లోపాలు, రోడ్ కటింగ్ అనుమతిలో జీహెచ్ఎంసీ నుంచి ఎదురైనా అవాంతరాలు.. అన్నింటి కంటే మించి సదరు సంస్థ పనులు చేపట్టలేక చేతులెత్తేసిన దరిమిలా ఈ ప్రాజెక్టు పనులు వందకు వంద శాతం పూర్తి కాలేదు.
ఈ నేపథ్యంలోనే డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. ఇందులో భాగంగానే మిగిలిపోయిన గ్యాపులను పూర్తి చేసి అసంపూర్తిగా నిలిచిన ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు దాదాపు 400 మీటర్ల మేరలో 1800 ఎంఎం డయా పైపులైన్ విస్తరణ పనులకుగాను రూ.9.42 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించారు. మొత్తంగా పైపులైన్లు వేసేందుకు కొన్ని చోట్ల భూమిని తవ్వే వీలు లేని పరిస్థితుల్లో ట్రెంచ్‌లెస్ టెక్నాలజీ సహాయంతో భూమిలో పైపులను పంపించి అప్పటికే ఉన్న పైపులైన్‌తో అనుసంధానించనున్నారు.
24 వరకు టెండర్ గడువు
వైఎంసీఏ మెట్రో ఫిల్లర్ నంబర్ 5 నుంచి కాచిగూడ క్రాస్‌రోడ్ ఫిల్లర్ నం 11 వద్ద మిగిలిన గ్యాపును పూర్తి చేశారు. బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్ దగ్గర, షాన్‌బాగ్ హోటల్, సూరజ్‌ఖాన్, సత్యనారాయణ, దినేశ్ జువెల్లరీ, లిబర్టీ క్రాస్ రోడ్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద 1800 ఎంఎం డయా పైపులైన్ పనులు చేపట్టనున్నారు. ఈ నెల 24 వరకు టెండర్ గడువు విధించారు. ట్రెంచ్‌లెస్ టెక్నాలజీ ఆర్సీసీ (1800 ఎంఎం డయా )పైపులైన్ పనులు పూర్తయితే అమీర్‌పేట నుంచి అంబర్‌పేట మీదుగా మురుగునీటి పారుదల వ్యవస్థ పూర్తి స్థాయిలో పటిష్టమవుతుంది. అంతేకాకుండా బల్కంపేట, సంజీవరెడ్డినగర్, యూసుఫ్‌గూడ, రాజ్‌భవన్, దోమలగూడ, బషీర్‌బాగ్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, సైఫాబాద్, నారాయణ గూడ, కాచిగూడ, నింబోలి అడ్డా వరకు ఉన్న అన్ని ప్రాంతాల్లో మురుగునీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభించనున్నది.