నగరంలో సొంతిల్లు.. ఇన్నాళ్లూ పేదలకు కలగానే మిగిలిపోయింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కలల సౌధం కండ్ల ముందే సాక్షాత్కారించింది. పైసా ఖర్చు లేకుండా… పారదర్శకంగా డబుల్ ఇండ్ల కేటాయింపు జరుగగా, సోమవారం అట్టహాసంగా మూడో విడత డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ జరిగింది. మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొని మొత్తం 19020 లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలను అందజేశారు. తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో జరిగిన పంపిణీ కార్యక్రమాల్లో లబ్ధిదారులు సీఎం కేసీఆర్‌కు శతకోటి వందనాలు అంటూ కొనియాడారు. పేదలకు బాసటగా నిలిచే బీఆర్ఎస్ సర్కారును మళ్లీ గెలిపించుకుంటామని ముక్తకంఠంతో పేర్కొన్నారు.
– సిటీబ్యూరో, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ)
శతకోటి వందనాలు
మాది అంబర్‌పేట నియోజకవర్గంలోని గోల్నాక. పక్షపాతంతో ఉన్న తండ్రి, కొడుకుతో బతుకుతున్నా. నాకు ఒంటరి మహిళ కింద ఆసరా పింఛన్ వస్తున్నది. 30 ఏండ్లుగా అద్దె ఇండ్లలో ఉంటున్నాం. ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇస్తుందని తెలుసుకొని, తహసీల్దార్ ఆఫీస్‌లో దరఖాస్తు చేసుకున్నాం. మాకు డబుల్బెడ్రూం ఇల్లు వచ్చిందని ఫోన్ రాగానే చెప్పలేని ఆనందంగా అన్పించింది. ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉంటుంది. అది సీఎం కేసీఆర్ సార్‌తో నిజమైంది. ఆయనకు శతకోటి వందనాలు.
– చంద్రిక, గొల్నాక, అంబర్‌పేట నియోజకవర్గం
మళ్లీ గెలిపిస్తాం..
20 ఏండ్ల నుంచి అద్దె చెల్లించి.. చెల్లించి.. విసిగిపోయాం. ఈ సమయంలో మాకు డబుల్ బెడ్ రూంను సీఎం కేసీఆర్ సార్ ఇచ్చిండు. ఇప్పటి వరకు ఇలాంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని చూడలేదు. తెలంగాణ వచ్చినంక పేద ప్రజలకు మేలు చేస్తుండు. డబుల్‌బెడ్ రూం ఇల్లు కోసం మేం ఎవరికి దగ్గరికీ పోలేదు. ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు. నిజమైన పేదలకు మేలు జరగడం మేం ఇప్పటి వరకు చూడలేదు. సీఎం కేసీఆర్‌ను మళ్లీ గెలిపించుకొని మా కృతజ్ఞత తెలుపుతాం.
– షాహనాజ్బేగం, మల్కాజ్గిరి నియోజకవర్గం
‘కిరాయి ఇండ్లలో ఉంటూ… నానా అవస్థలు పడ్డాం. వచ్చిన సంపాదన కేవలం బతుకుబండి లాగడానికే సరిపోయేది. ఉన్న కొద్దిపాటి సంపాదనతో అన్ని ఖర్చులూ భరించడంతో పాటు అద్దెకట్టడం భారంగా ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం మా సొంతింటి కలను నిజం చేసింది. నయా పైసా ఖర్చులేకుండా విశాలమైన డబుల్ బెడ్రూం ఇల్లు దక్కింది. ఇది మా ఇల్లు అని గర్వంగా చెప్పుకుంటాం.. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం’ అని డబుల్ బెడ్రూం పొందిన లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు రెండు దఫాలుగా పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం పంపిణీ చేసింది.
తాజాగా మూడో దఫా 36,884 ఇండ్లను రెండు దశల్లో ప్రభుత్వం అందించాలని సంకల్పించి… లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసింది. ఇందులోభాగంగా తొలిదశలో సోమవారం గ్రేటర్ వ్యాప్తంగా కుత్బుల్లాపూర్, చేవెళ్ల, మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, పటాన్చెరు, మేడ్చల్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19,020 మందికి మంత్రులు పట్నం మహేందర్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి ఇండ్ల పట్టాలను అందించారు. ఈ నెల 5న మరో 17,864 డిగ్నిటీ హోమ్స్‌ను లబ్ధిదారులకు అప్పగిస్తారు.
– సిటీబ్యూరో, అక్టోబర్ 2(నమస్తే తెలంగాణ)
అన్నింటా తెలంగాణ ఆదర్శం
జగద్గిరిగుట్ట, అక్టోబర్2: శతాబ్దానికి ఒకరు మాత్రమే గాంధీలా చరిత్రలో నిలిచిపోయే నేతలు వస్తుంటారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. దేశానికి స్వాతంత్రం గాంధీ తీసుకొస్తే.. ఉనికి కోల్పోతున్న తెలంగాణను కేసీఆర్ సాధించారన్నారు. దుండిగల్ గండిమైసమ్మ వద్ద సోమవారం జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి.. డబుల్బెడ్రూం లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించారు.
సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుతో కలిసి ఆవిష్కరించారు. ఇంటింటికీ నల్లా, మిగులు విద్యుత్, పరిశ్రమలు, ప్రజాసంక్షేమం ఇలా అన్నింటా దేశంలోని ఇతర రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కాగా, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, సనత్నగర్లకు చెందిన 3142 ఫ్లాట్లను లబ్ధిదారులకు అప్పగించారు. కార్యక్రమంలో నిజాంపేట మేయర్ కొలనునీలాగోపాల్రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్లను అమ్మితే చర్యలు
మణికొండ, అక్టోబర్ 2 : పేద ప్రజలు ఆత్మగౌరవంతో గొప్పగా జీవనం సాగించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యమని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని నార్సింగి, బైరాగిగూడలోని 356 మంది లబ్ధిదారులకు మూడో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నార్సింగిలో నిర్వహించారు. ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌లతో కలిసి మేయర్ లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఇతరులకు అమ్మినా.. కొనుగోలు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
పైసా ఖర్చు లేకుండా ఇండ్లు
కొండాపూర్, అక్టోబర్ 2 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం పథకం పేదలకు వరంలా మారిందని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని నల్లగండ్లలో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలిసి లబ్ధిదారులకు డబుల్బెడ్రూం ఇండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ.. నయా పైసా ఖర్చు లేకుండా ప్రతి పేదోడికి డబుల్ బెడ్రూం ఇంటిని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, పని చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు తప్పకుండా ఆదరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంగాధర్‌రెడ్డి, పూజితగౌడ్, మంజులరెడ్డి, జగదీశ్వర్‌గౌడ్, రోజాదేవి, శ్రీనివాస్‌రావు, మాజీ కార్పొరేటర్ సాయిబాబా, జెడ్సీ శ్రీనివాస్‌రెడ్డి, డీసీ రజనీకాంత్‌రెడ్డి, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సంతోషంగా ఉంది
డబుల్ బెడ్రూం ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉంది. పుట్టినప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నా.. ఇల్లు లేదు. సొంతిల్లు ఉంటే బాగుంటుందని ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్నాం. ఇండ్లలో పని చేసుకుంటూ బతుకుతున్నాం. మా కుటుంబానికి పెద్దగా ఆదాయమేమి లేదు. దరఖాస్తు చేసుకొని చాలా రోజులు అవుతున్నది. ఒకరోజు మాకు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించినట్టు అధికారులు ఫోన్ చేశారు. ఆ రోజు కుటుంబ సభ్యులంతా చెప్పలేనంత సంతోషంతో పండుగ చేసుకున్నాం. ఇన్నేండ్లకు దేవుడు మా కష్టాలను సీఎం కేసీఆర్ సార్ రూపంలో తీర్చాడు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
లబ్ధిదారులను పూర్తి పారదర్శకంగా ఎంపిక చేశాం. ఇప్పటి వరకు వివిధ రంగాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధిక అవార్డులు పొందిన రాష్ట్రంగా తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. ఆడ బిడ్డ పెండ్లికి, ఇంటి నిర్మాణానికి ఆర్థికంగా సహకరిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే.
– ఎమ్మెల్యే గాంధీ
దేవుడిలా.. సొంతింటికల నెరవేర్చారు..
ముగ్గురు ఆడపిల్లలతో అద్దె ఇంట్లో ఉంటూ అనేక కష్టాలు పడుతున్నాం. సమయానికి అద్దె చెల్లించలేక, పిల్లల చదువులు, ఇతర ఖర్చులకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ దేవుడిలా సొంతింటి కల నెరవేర్చారు.
– గీతా మోహన్, మార్తాండనగర్, కొండాపూర్
కొల్లూర్‌లో లబ్ధిదారులకు డబుల్బెడ్రూం ఇండ్ల పట్టాలు అందజేత
రామచంద్రాపురం, అక్టోబర్ 2: రాష్ట్రంలో నిరుపేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, పారదర్శకంగా లబ్ధిదారులకు అందజేస్తున్నామని చెప్పారు. లక్కీడ్రాలో పార్టీలకతీతంగా డబుల్ బెడ్రూం ఇండ్లు వస్తున్నాయని, పేదలు రూపాయి ఖర్చు పెట్టకుండానే రూ.70 లక్షలు విలువ చేసే ఇండ్లను ప్రభుత్వం అందజేస్తున్నదని మంత్రి అన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీనే ఆశీర్వదించి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు.
సోమవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో లబ్ధిదారులకు డబుల్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పటాన్‌చెరుతో పాటు కూకట్పల్లి, ఖైరతాబాద్, చార్మినార్, నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాల లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా కొల్లూర్‌లో 150 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైన డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రాజెక్ట్‌ని ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. లబ్ధిదారులు ఇండ్లను అమ్ముకోకుండా కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మహిపాల్‌రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ భూపాల్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌చెర్మన్ రాములుగౌడ్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ సార్‌కు కోటి దండాలు
నిరుపేదనైన నాకు డబుల్ బెడ్రూం కట్టించి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్సార్కు కోటి దం డాలు. మా కుటుంబం కొన్నేండ్లుగా కిరాయి ఇంట్లోనే ఉంటున్నది. ఎన్నో బాధలు పడ్డాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ దయ వల్ల సొంతింటి కల నెరవేరింది.
– లక్ష్మి , ఎల్బీనగర్
కేసీఆర్ అంటేనే నమ్మకం: మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్, అక్టోబర్ 2(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే నమ్మకం బీఆర్ఎస్ పార్టీ అంటే విశ్వాసం అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రాంపల్లిలో సోమవారం ఎల్బీనగర్, మలక్‌పేట్, చార్మినార్ నియోజకవర్గాలకు చెందిన 3,214 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం పత్రాలను జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్‌తో కలిసి మంత్రి మల్లారెడ్డి అందజేశారు. ఈసందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు రూ. 35 లక్షల విలువగల ఇంటిని కట్టించి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని అన్నారు. స్థానికులకు 10 శాతం డబుల్బెడ్రూం కేటాయింపులు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటం తెలంగాణ ప్రజలు అదృష్టంగా భావించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దరిద్రపుగొట్టు పార్టీ అని 56 ఏండ్లు అధికారంలో ఉన్నా.. ప్రజలకు చేసింది ఏమీ లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్కామ్లకే ప్రాధాన్యత ఇచ్చి భూమి నుంచి ఆకాశం దాకా వదలలేదని మంత్రి మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞాప్తి చేశారు. ఒకవేళ పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను బంద్ చేస్తుందన్నారు. తొమ్మిందేండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి రాష్ర్టాన్ని అభివృద్ధి చేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్, అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, నాగారం మున్సిపల్ ఛైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పేదల ఆత్మగౌరవం కోసం..
‘నిరుపేదల సొంతింటి కల సీఎం కేసీఆర్ నిజం చేశారు. పేదల ఆత్మ గౌరవ కోసం ఆయన డబుల్బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చారు. దేశంలో 28 మంది సీఎంలున్నా.. ఎవరికీ ఈ ఆలోచన రాలేదు. వచ్చినా వారితో సాధ్యం కాదు’ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ అహ్మద్‌గూడలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మల్కాజ్గిరి ప్రజలకు 1845, అంబర్‌పేట నియోజకవర్గానికి 120 ఇండ్లు కేటాయించారు. ఇండ్ల కేటాయింపు పత్రాలను లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి అందించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు.
పేదల పక్షపాతి సీఎం కేసీఆర్
మహేశ్వరం, అక్టోబర్ 2: పేదల పక్షపాతిగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని, పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం మండల పరిధిలోని మన్సాన్పల్లి వద్ద పేదలకు 2099 డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, మెతుకు ఆనంద్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు నిరంతర ప్రక్రియ అని అన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుభీమా, దళితబంధు, ఆసరా పింఛన్ల వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కోట్లాది మంది గుండెల్లో సీఎం కేసీఆర్ గూడు కట్టుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, మెతుకు ఆనంద్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, ఇన్చార్జి ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
30 ఏండ్లుగా కిరాయి కట్టలేక..
మేము 30 ఏండ్ల నుంచి కిరాయి ఇంట్లోనే ఉంటున్నాం. 2016లో ఆన్లైన్లో దరఖాస్తు పెట్టాం. ఇల్లు వచ్చిందని చెప్పగానే ఎంతో సంతోష పడ్డాం. మాకు డబుల్ బెడ్రూం ఇండ్లను ఇచ్చిన సీఎం కేసీఆర్ సల్లగా ఉండాలి. మళ్లీ బీఆర్ఎస్ సర్కారే రావాలని కోరుకుంటున్నాం. మేమంతా సీఎం కేసీఆర్ పార్టీకే మద్దతు తెలుపుతాం.
– జహేర బీ. ఎన్టీఆర్నగర్
సొంతింటి కల నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే
పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కింది. కేవలం తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ సర్కారు హయాంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు దిగ్విజయంగా అమలవుతున్నాయి. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు.
– ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి
సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నేత
ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ఉన్న నేత. కులమతాలకు అతీతంగా డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులైన పేదలందరికీ అందిస్తున్నాం. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న బీఆర్ఎస్ సర్కారుకు ప్రజలంతా అండగా ఉండాలి.
– ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
అడగకుండానే విలువైన ప్రాంతాల్లో డబుల్బెడ్రూంఇండ్లు ఇవ్వడం సీఎం కేసీఆర్ గొప్పతనం. ఇల్లు రానివారికి కూడా న్యాయం జరుగుతుంది. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని ప్రజలే తిప్పి కొట్టాలి.
– ఎమ్మెల్యే వివేకానంద్
పారదర్శకంగా ఇండ్ల కేటాయింపు
భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి పథకాలు ఇప్పటివరకూ అమలు కాలేదు. పారదర్శకంగా డబుల్ ఇండ్లు కేటాయిస్తున్నాం. పైసా ఖర్చులేకుండా అందిస్తున్నాం.
– ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
ఎలాంటి అవకతవకలకు చోటులేకుండా..
ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చారంటూ కచ్చితంగా నిలబెట్టుకుంటారనే విషయం డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ద్వారా మరోసారి నిరూపణ అయింది. ఎలాంటి అవకతవకలకు చోటివ్వకుండా డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక లక్కీ డ్రా ద్వారా చేశారు. నియోజకవర్గంలో ఇప్పటిదాకా 2643 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లను అందించాం.
– ఎమ్మెల్యే దానం నాగేందర్
సీఎం కేసీఆర్ చలవే..
ముగ్గురు ఆడపిల్లల బాధ్యతతో 30 ఏండ్లు కష్టపడినా సొంత ఇల్లు సమకూర్చుకోలేకపోయాం. మాలాంటి ఎందరికో కేసీఆర్ డబుల్బెడ్రూం పథకం మేలు కలిగించింది. మాకంటూ ఆస్తి ఉందనే ధైర్యం కేసీఆర్ ప్రభుత్వం కల్పించింది.
దేవుడిలా దారి చూపినసీఎం కేసీఆర్
భర్త చనిపోయి, కూతురి పెండ్లి చేసి ఒంటరిగా బతుకుతున్న. నాకు డబుల్ బెడ్రూం రావడం సంతోషంగా ఉంది. ఎన్నో ఏండ్ల నుంచి సిటీలో ఉంటున్న.. సొంతిల్లు లేదు. కిరాయి ఇంట్లోనే ఉంటున్నా. ఇప్పుడు పూలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నా. పూట గడవటం కష్టంగా ఉంది. తిండికి ఇబ్బంది పడుతున్న నాకు కిరాయి చెల్లించడం కావడం లేదు. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇచ్చి నాకు దేవుని లెక్క దారి చూపారు.
స్కూల్లో ఆయాని..ఇంటికి యజమానురాలిని
గాజులరామారం డివిజన్ చంద్రగిరినగర్‌లోని ప్రైవేటు స్కూల్లో ఆయాగా పనిచేస్తా. కొద్దిపాటి సంపాదనతోనే అన్ని ఖర్చులూ భరించడంతో పాటు అద్దె కట్టడం ఇబ్బందిగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పథకాలపై నమ్మకంతో ఎదురుచూశాం. మా ఆశలు నిజమయ్యాయి. ఇప్పటినుంచి గర్వంగా మేము
ఓ సొంత ఇంటికి యజమానులమని చెప్పుకొంటాం.
– షహనాజ్‌బేగం, చంద్రగిరినగర్