సిటీబ్యూరో: పాతబస్తీ ప్రాంతంలో చేపట్టనున్న ప్రతిష్టాత్మక రహదారుల విస్తరణ పనుల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సీటీ) ప్రాజెక్టు కింద అమలవుతున్న ప్యాకేజీ-4, ప్యాకేజీ-5 పనులను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో నం. 554 జారీ చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న రోడ్డు విస్తరణ ప్రణాళికల్లో భూసేకరణ, యూటీలిటీ షిఫ్టింగ్ ప్రక్రియలు వేగవంతం చేయడం, టెండర్ల ఆలస్యాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.863 కోట్లుగానే కొనసాగుతుందని స్పష్టం చేసింది. తాజా సవరణల ప్రకారం చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్స్ నుంచి బారాస్ వరకు వెళ్లే ప్రధాన రహదారిని 60 ఫీట్ల నుంచి 80 ఫీట్లకు విస్తరించనున్నారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ సమీపంలో అండర్ పాస్ నిర్మాణానికి ఆమోదం లభించింది. 2022లో ఆమోదించిన రోడ్ డెవలప్ మెంట్ ప్లాన్ (ఆర్డీపీ) ప్రకారం ఈ పనులు చేపట్టనున్నారు.
రూ.620 కోట్ల వ్యయంతో ప్యాకేజీ-4 కింద ఐదు ప్రధాన రోడ్ల విస్తరణ పనులను ఒకే టెండర్ ద్వారా చేపట్టనున్నారు. ఇందులో అజీమ్ హోటల్ నుంచి చర్చి గేట్ వరకు 80 ఫీట్ల రహదారి, చాంద్రాయణగుట్ట-బారాస్ మార్గం, లకీ స్టార్ హోటల్ నుంచి హఫీజ్ బాబా నగర్ వరకు రహదారి విస్తరణ, అలాగే ఎన్ హెచ్ బెంగళూరు హైవే నుంచి శాస్త్రిపురం జంక్షన్, అకడి నుంచి ఇంజిన్ బౌలి వరకు 100 ఫీట్ల రోడ్ల అభివృద్ధి పనులు ఉన్నాయి. రూ. 243 కోట్ల వ్యయంతో తులసినగర్ నుంచి గౌస్ నగర్ వరకు 100 ఫీట్ల రహదారి విస్తరణ పనులను ప్రత్యేకంగా టెండర్ పిలిచి అమలు చేయనున్నారు.
ఈ పనులకు సంబంధించి డీపీఆర్ తయారీ, భూసేకరణ ప్రణాళిక, డిజైన్లు, డ్రాయింగ్ల రూపకల్పన కోసం కన్సల్టెన్సీ సేవలను నియమించుకునేందుకు కూడా ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అనుమతి ఇచ్చింది. సవరించిన ప్రణాళికలను తక్షణమే అమలు చేసి, భూసేకరణ, యూటీలిటీ మార్పిడి, టెండర్ల ప్రక్రియలను వేగవంతం చేయాలని ప్రభుత్వం జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. పాతబస్తీలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేరొంది.