సిటీబ్యూరో, మార్చి 22(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో మెట్రో విస్తరణ నీటి మూటలుగా మారుతోంది. నగర ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన మెట్రో రెండో దశను అంధకారంలో పడేస్తోంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో అత్తెసరు నిధుల కేటాయింపులతో, మెట్రో విస్తరణపై సర్కార్‌కు ఉన్న చిత్తశుద్ధి బయటపడుతోంది. రెండున్నరేండ్లలో 7.5 కిలోమీటర్ల ఓల్డ్ సిటీ మెట్రోకు భూసేకరణ పూర్తి చేయలేని సర్కార్.. చాలీచాలనీ నిధులతో ఏకంగా రూ. 24వేల కోట్ల మెట్రో ఫేజ్-2ను పట్టాలెక్కిస్తామని చెప్పుకోవడం నగరవాసులను విస్మయానికి గురిచేస్తోంది.
రూ. 1100 కోట్లు కేటాయింపు
తాజా బడ్జెట్లో కాంగ్రెస్ సర్కారు మెట్రో రైలు ప్రాజెక్టు కోసం మొత్తం రూ. 1100 కోట్లను కేటాయించింది. ఇందులో విస్తరణకు రూ. 600 కోట్లు కాగా, మిగిలిన రూ. 500 కోట్లను అప్పుల రూపంలో చెల్లించేందుకు కేటాయిస్తామని పేర్కొంది. 76 కిలోమీటర్ల మేర మెట్రో ఫేజ్-2 విస్తరణకు కేవలం రూ. 600 కోట్లతో ఎలా పనులు చేపడుతుందనేది అంతు చిక్కని అంశంగా మారింది. కనీసం మధ్యలో ఉన్న ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణకు కూడా సరిపోని స్థాయిలో నిధులను కేటాయించింది., ఈ నిధులను ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ్‌గుట్ట వరకు ఆస్తులు కోల్పోతున్నవారికి ఇచ్చిన… మరో రూ.300 కోట్లు అదనంగా ఖర్చు చేస్తే గానీ ప్రాజెక్టుకు అవసరమైన భూములను సేకరించలేని పరిస్థితి ఉంది.
టేకోవర్ చిక్కుముడి
మెట్రో రెండో దశను జాయింట్ వెంచర్‌గా చేపడుతామని రాష్ట్ర సర్కార్ తన డీపీఆర్‌లో పేర్కొంది. ఇందులో భాగంగా కేంద్రం నుంచి దాదాపు రూ. 5-6వేల కోట్లు రావాల్సి ఉంది. అంత కంటే ముందు ప్రాజెక్టుకు అనుమతులు రాలేదంటే… సర్కారు ఎక్కడి నుంచి ఈ ప్రాజెక్టును చేపడుతారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఎల్అండ్టీతో తెగదెంపులు చేసుకునేంత వరకు కూడా మెట్రో విస్తరణకు అనుమతులు ఇచ్చేది లేదని బాహాటంగానే కేంద్రం చెబుతున్న నేపథ్యంలో..గత ప్రభుత్వం హయాంలో సిద్ధం చేసిన అలైన్మెంట్లను ఉన్న పళంగా రద్దు చేయడం, జనసంచారమే లేని ప్రాంతాలతో మెట్రో ప్రణాళికలు రూపొందించడం, స్పష్టమైన డీపీఆర్ లేకుండానే అనుమతులు కోరడం వరకు సర్కార్ చేసిన తప్పిదాలతో కేంద్రం అనుమతులు ఇవ్వకుండా కొర్రీలు పెడుతున్నది. దీంతో అనుమతులు ఇప్పటికిప్పుడు ఇచ్చినా…పనులు మొదలు కావడానికి కనీసం మరో రెండేండ్లు పట్టేలా ఉంది.
ప్రణాళిక లోపం… ప్రజలపై భారం
బృహత్తర ప్రాజెక్టును పట్టాలెక్కించడంలో కాంగ్రెస్ సర్కారు మూడూ ప్రధాన విషయాలను విస్మరించిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతోనే ప్రాజెక్టుకు అనుమతుల్లో జాప్యం ఏర్పడుతుండగా, అనవసరంగా మెట్రో టేకోవర్ అంశాన్నీ సర్కారు మెడకు వేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆలైన్మెంట్ మార్పులతో ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగే అవకాశం ఏర్పడింది. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంతో పేచీ, మెట్రో నిధుల సర్దుబాటు చేయలేక కేవలం ప్రకటనలకే పరిమితమైందనే విమర్శలు ఉన్నాయి. ఇక తాజా కేటాయింపులతో మెట్రో విస్తరణ అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మెట్రో విస్తరణకు అడుగులు పడే పరిస్థితి లేదు.