ఉస్మానియా యూనివర్సిటీ : యూజీసీ చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థ అని, కేంద్రం తన సొంత ఎజెండాను వర్సిటీలలో అమలుపరిచేందుకు కుట్రలు చేస్తోందని ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు విరాజ్ దేవాంగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి దినేశ్ సిరంగరాజ్ ఆరోపించారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ యూజీసీ నూతన మార్గదర్శకాలు రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఓయూ ఆరట్స్ కళాశాల ఆవరణలో ఏఐఎస్ఎఫ్ ఓయూ కౌన్సిల్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విరాజ్ దేవాంగ్, దినేశ్ సిరంగరాజ్, జాతీయ ఉపాధ్యక్షుడు స్టాలిన్, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థను దెబ్బతీసే విధంగా పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పూర్తిగా గవర్నర్ చేతిలో వీసీల నియామకాలు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. యూజీసీ 2025 సవరించిన నియమాలలో వీసీల ఎంపికలో గవర్నర్లకు ఎక్కువ అధికారాన్ని ఇస్తున్నాయని, ఇది ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి సభ్యులు నరేశ్, ఓయూ అధ్యక్ష కార్యదర్శులు లెనిన్, నెల్లి సత్య, నాయకులు ఆరెకంటి భగత్,ఉప్పల ఉదయ్, అశ్వన్ , ప్రసాద్, దిలీప్, గోపగోని ఉదయ్ సలీం, పేర్ల రాము తదితరులు పాల్గొన్నారు.
వర్సిటీలపై కేంద్రం కుట్రలు
హిమాయత్ నగర్, ఫిబ్రవరి11: దేశంలోని యూనివర్సిటీల స్వయం ప్రతి పత్తిని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ విమర్శించారు. మంగళవారం హైదర్ గూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు కేంద్ర ప్రయత్నిస్తుందన్నా రు. యూజీసీ చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థ అని కేంద్రం తన సొంత ఎజెండాను యూనివర్సిటీలో అమలు చేసినందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. సంఘం నాయకులు సుధాకర్,జానీ పాల్గొన్నారు.