హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు బడులు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. 1,977 సర్కారు స్కూళ్లు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటికి ఇప్పటి వరకు విద్యుత్తు కనెక్షన్లు లేవు. మరో 81 ఎయిడెడ్, 7 ప్రైవేట్ స్కూళ్లు విద్యుత్తు కనెక్షన్ లేకుండానే నడుస్తున్నాయి. 3,366 స్కూళ్లకు విద్యుత్తు కనెక్షన్ ఉన్నా వినియోగించుకునే స్థితిలో లేవు. సర్కారు బడుల్లోని 1,037 స్కూళ్లల్లో తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు అందుబాటులో లేవు. మరో 59 ఎయిడెడ్, 4 ప్రైవేట్ స్కూళ్లు కూడా కనీసం విద్యార్థులకు నీళ్లు ఇవ్వలేని స్థితిలో ఉన్నాయి. 30వేల సర్కారు బడుల్లో పేరుకు తాగునీటి వసతి ఉన్నా వినియోగించుకునే స్థితిలో ఉన్న స్కూళ్లు 27వేలు మాత్రమే.
అంటే మూడు వేల బడుల్లో నీళ్లుండి తాగలేని స్థితిలో ఉన్నాయి. ఇక బడుల్లో బాలబాలికలకు వేర్వేరు టాయిలెట్లు ఉండాలి. ప్రభుత్వ యాజమాన్యంలో బాలుర కో-ఎడ్యుకేషన్ స్కూళ్లు 28,689 ఉంటే బాలురకు ప్రత్యేకంగా టాయిలెట్లు ఉన్న స్కూళ్లు 23,866 మాత్రమే. అంటే 4,823 సర్కారు స్కూళ్లల్లో బాలురకు ప్రత్యేకంగా టాయిలెట్లు లేవు. ప్రభుత్వ యాజమాన్యంలోనే బాలికల కో ఎడ్యుకేషన్ స్కూళ్లు 29,383 ఉంటే వీటిలో 27,366 స్కూళ్లల్లో మాత్రమే బాలికలకు ప్రత్యేకంగా టాయిలెట్లున్నాయి. అంటే 2,017 స్కూళ్లల్లో బాలికలకు టాయిలెట్లు లేవన్నమాట.
2,846 సర్కారు పాఠశాలల్లో టాయిలెట్లకు సమీపంలో హ్యాండ్‌వాష్ సౌకర్యంలేదు. 127 ఎయిడెడ్, 403 ప్రైవేట్ స్కూళ్లల్లోనూ ఇదే పరిస్థితి. 2,277 స్కూళ్లల్లో బాలికల టాయిలెట్లు, 2,618 స్కూళ్లల్లో బాలుర టాయిలెట్లు ఉన్నా అవి..వినియోగించకోలేని స్థితిలో ఉన్నాయి. 5వేల సర్కారు బడులు, మరో ఐదు వేల ప్రైవేట్ బడుల్లో అసలు వైద్య పరీక్షలే నిర్వహించడంలేదు. ఈ విషయాలు యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్ (యూ డైస్) ప్లస్ 2023-24 నివేదికలో వెలుగుచూశాయి. నివేదికను కేంద్ర విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది.