కీసర, జూన్ 15; ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు యువకులు గల్లంతు కాగా ఒకరి మృతదేహం లభించింది. మరో యువకుడి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ ఘటన కీసర పోలీస్స్టేషన్ పరిధిలోని తిమ్మాయిపలిల్లో చోటుచేసుకుంది. కీసర సీఐ ఆర్కేపల్లి ఆంజనేయులు కథనం ప్రకారం.. బొల్లారం ప్రాంతానికి చెందిన జోసెఫ్ (20), కెవిన్ అంటోని (19), వాలెంటైన్ టోని (18)లు కలిసి ఫొటో షూట్ కోసం ముందుగా కీసర సర్కిల్ ప్రాంతంలోని యాద్గార్పల్లి చెరువు దగ్గరికి వచ్చారు. అక్కడి నుంచి నేరుగా తిమ్మాయిపల్లిలోని చెరువు వద్దకు వచ్చారు.
ఒక్కొక్కరు చెరువులోకి ఫొటో దిగడానికి వెళ్లారు. ఒకరి తరువాత ఒకరు చెరువులోకి దిగుతుండగా ఆ ముగ్గురిలో జోసఫ్ వెంటనే వెనక్కి వచ్చేశాడు. అయితే కెవిన్ అంటోని, వాలెంటైన్ టోనిలు చెరువు లోపలికి వెళ్లి మునిగిపోయారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న కీరస పోలీసులు గల్లంతైన వారిని చెరువులోంచి బయటికి తీయడానికి డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి కేవీన్ అంటోని మృతదేహాన్ని బయటకు తీశారు. ఇంకా వాలెంటైన్ టోని కోసం గాలింపు కొనసాగుతోంది.