 
                                                            ఘట్కేసర్, జూలై 11: ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి.. దొంగతనాలు చేస్తున్న ఇద్దరు యువకులను గురువారం ఘట్కేసర్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం.. కొండాపూర్లో రేణుక టీ కొట్టు నిర్వహిస్తున్నది. గత నెల 17న ఇద్దరు యువకులు టీ కొట్టు వద్దకు స్కూటీపై వచ్చి సిగరెట్ కావాలని అడిగారు. రేణుక ఇచ్చే క్రమంలోనే ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడును తెంచుకొని స్కూటీపై పారిపోయారు. బాధితురాలు ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేపట్టారు. గురువారం శివారెడ్డిగూడెం వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా, స్కూటీపై ఉన్న ఇద్దరి యువకులు సాయితేజ(21), ఆకాశ్(20)ను అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
 
                            