Hyderabad | ముషీరాబాద్, జూన్ 13 : గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ డి రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్ గంగపుత్ర కాలనీకి చెందిన రాజేష్(21), దినేష్ రెడ్డి(25) లు గత కొంతకాలంగా ఏపీలోని వైజాగ్, అరకు నుంచి గంజాయి తీసుకువచ్చి రహస్యంగా విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ముషీరాబాద్ పార్సీగుట్ట చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా హుందాయ్ కారులో 9 కిలోల గంజాయిని గుర్తించారు. వెంటనే దినేష్, రాజేష్ అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారు వాడిన కారును, రెండు సెల్ ఫోన్లను సీజ్ చేశామని సీఐ రామకృష్ణ తెలిపారు.