మేడ్చల్, అక్టోబర్ 7 : విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…కండ్లకోయ పరిధి హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీ మూత పడటంతో అందులోని సామగ్రిని యాజమాన్యం తరలిస్తున్నది. ఇందులోభాగంగా కార్మికులు సోమవారం ఉదయం పొడుగ్గా ఉన్న నిచ్చెనను తరలించేందుకు సిద్ధమయ్యారు.
కార్మికులు 15 ఫీట్లు ఉన్న ఆ ఇనుప నిచ్చెనను ఒక్కసారిగా పైకి ఎత్తి వాహనంలో లోడ్ చేసేందుకు యత్నించారు. ఈ ప్రయత్నంలో పై నుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్ తీగలను చూసుకోలేదు. నిచ్చెన కరెంటు తీగలకు తలగడంతో కార్మికులు విద్యుదాఘాతానికి గురయ్యారు. బీహార్‌కు చెందిన చోట పాశ్వాన్(25), గుడు బైట(26), కరం కుమార్(22), లకింధర్కుమార్(20), పువో మాంజీ(25)లను కండ్లకోయలోని సీఎంఆర్ వైద్య కళాశాలలకు తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన గుడు బైట, పువో మాంజీలకు వైద్యులు సీపీఆర్ చేసి బతికే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండాపోయింది.
మిగితా వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయితే యాజమాన్యం మొదట ఐదుగురిని ఆస్పత్రికి తరలించి.. ఆ తర్వాత మరో ఇద్దరు కార్మికులను ఒకరి తర్వాత ఒకరిని తరలించడం అనుమానాలను తావిస్తున్నది. అసలు ప్రమాదం ఎలా జరిగింది..? ఆ సమయంలో ఎంత మంది కార్మికులు ఉన్నారు..? పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించడం లేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సమగ్ర విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరమున్నదని స్థానికులు కోరుతున్నారు.