వెంగళరావునగర్, మార్చి11: అరిష్టం పట్టిందని గుడిలోని శివపార్వతుల పంచలోహ విగ్రహాలను దొంగిలించి ఇద్దరు మహిళలు ఇంటికి తెచ్చుకున్నారు. ఈ ఘటన ఎస్.ఆర్. నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్‌కు చెందిన స్వర్ణలత(29), తన సోదరి పావని(26) కలిసి ఉంటున్నారు. రెండేండ్లలో స్వర్ణలతో ఇంట్లో వరుసగా తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులు వెంటవెంటనే మరణించారు. దీంతో స్వర్ణలత ఇంటికి కీడు పట్టిందని.. ఇది తొలిగిపోవాలంటే ఆది దేవుళ్లను గుడిలో నుంచి కాజేసి ఇంటికి తెచ్చుకుంటే అరిష్టం తొలిగి సకల శుభాలు కలుగుతాయని భావించింది.
ఈ నెల 8న ఎస్.ఆర్.నగర్ సమీపంలోని గురుమూర్తినగర్‌లోని శ్రీ వినాయక టెంపుల్‌కు సోదరితో కలిసి వెళ్లింది. అక్కడ అర్చకుడు నవీన్‌కుమార్ ప్రసాదాలు పంచి పెడుతుండగా ఇదే అదునుగా శివపార్వతుల పంచలోహ విగ్రహాలను కాజేశారు. ఇది గమనించిన అర్చకుడు నవీన్ ఆలయ ఈవో నరేందర్‌రెడ్డికి తెలియజేయగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు స్వర్ణలత, పావనీలే చోరీకి పాల్పడినట్లు తేల్చి పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను ఎస్.ఆర్. నగర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ పి.వెంకటరమణ, ఎస్.ఆర్.నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డీఐ గోపాల్, డీఎస్సై సూరజ్‌తో కలిసి మీడియాకు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.