కాచిగూడ : ఫుట్‌పాత్‌పై పడుకున్న బాలున్ని గుర్తుతెలియని మహిళ ఈ నెల 10న రాత్రి ఎత్తుకొని ఉడాయించిన విషయం విధితమే. అయితే ఈ కేసును పోలీసులు త్వరితగతిన చేదించి, మహిళను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు కాచిగూడ ఇన్స్పెక్టర్ హాబీబుల్లాఖాన్ తెలిపారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ మహాబూబ్‌నగర్ ప్రాంతానికి చెందిన మారుతి భార్య బిడ్డలతో బిక్షటన చేస్తూ కాచిగూడ రైల్వేస్టేషన్ ఫుట్‌పాత్‌పై నివసముంటున్నారు. వారి కుమారుడు విధులోల్ల అరవింద్ (ఒకటిన్నర ఏండ్లు). ఈ నెల10న రాత్రి తన తల్లితో కలిసి అరవింద్ ఫుట్‌పాత్‌పై పడుకున్నాడు. ఇదే ఆదునుగా గుర్తుతెలియని మహిళ అరవింద్‌ను ఎత్తుకుని పారిపోయింది.
ఉదయం బాబు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో సీసీ కెమెరా పుటేజీల ద్వారా రోడ్డుపై వెలుతున్న ఒక మహిళను అనుమానితురాలిగా గుర్తించామని, ఆమెను పట్టుకోవడానికి తీవ్రంగా గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.
రాత్రి కావడంతో నిందితురాలి ముఖం సీసీ పుటేజీల్లో స్పష్టంగా కనిపించడం లేదని, ఆ సమయంలో రైల్వేస్టేషన్‌లోకి ఎవరెవరు వచ్చారని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను పోలీసులు ఆరాతిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితురాలి కోసం కాచిగూడ డీఐ, కాచిగూడ ఇన్స్పెక్టర్ బృందాలను రంగంలోకి దించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
త్వరలో నిందితులను పట్టుకుని తీరుతామని ఆయన పేర్కొన్నారు. సమాచారం తెలిస్తే వెంటనే 9490616368,9490616378, 040-27854778కు సమాచారం ఇవ్వాలని ఎస్సై రాంబాబు కోరారు.