దుండిగల్, డిసెంబర్ 26: నిజాంపేట్ సర్కిల్ పరిధిలో విషాదచాయలు అలుముకున్నాయి. అయ్యప్పమాలాదారులకు వంట చేసి పెట్టేందుకు శబరిమలైకి వెళ్లి తిరిగివస్తూ ఏపీలోని ఆళ్ల వద్ద జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో మరణించిన నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు నిజాంపేట్‌కు చెందిన వారు కావడంతోపాటు క్షతగాత్రుల్లో మరో ఇద్దరు యువకులు ఉన్నారు. దారుణం ఏమిటంటే అన్నదమ్ములు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతానికి చెందిన కులకర్ణి గుండేరావు(52), శైలు దంపతులు 20 ఏండ్ల క్రితమే నగరానికి వలసవచ్చి నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్-1,54వ బ్లాక్‌లోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్నారు.
వీరికి శివసాయి అలియాస్ బన్ని(22), సిద్దార్ధ అలియాస్ అలియాస్ సన్ని(19) ఇద్దరు కొడుకులు ఉన్నారు. బన్ని బీటెక్ చదువుతుండగా, సన్ని ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. మొదట్లో గుండేరావు ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇల్లు గడవడం ఇబ్బందిగా మారడంతో గడిచిన కొన్నేండ్లుగా కేటరింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఇండోర్, అవుట్డోర్ కేటరింగ్లు చేస్తుండటంతో కొడుకులిద్దరూ అతని సాయంగా వెళ్లేవారు. ఈ క్రమంలో పక్షం రోజుల క్రితం కొందరు అయ్యప్పమాలాదారులు బస్సులో శబరిమలైకి బయలుదేరారు. మద్యలో వచ్చే ఆలయాల సందర్శన ఉండటంతో వంటలు చేసేందుకు గాను గుండేరావును మాట్లాడుకుని వారికి క్వాలీస్ వాహనాన్ని అప్పగించారు.
దీంతో గుండేరావుకు తోడుగా అతని ఇద్దరు కుమారులు బన్ని, సన్ని బాచుపల్లి సాయినగర్‌కు చెందిన నర్సింగ్(35), శ్రావణ్, సిద్దప్పలు వెళ్లారు. అయితే శబరిమల యాత్ర పూర్తి చేసుకుని అయ్యప్పస్వాములతో కలిసి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో అయ్యప్పస్వాముల బస్సును అనుసరిస్తూ వెనకవస్తుండగా శుక్రవారం తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో ఏపీలోని ఆళ్లగడ్డ ప్రాంతంలో క్వాలీస్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొనడంతో అందులో ప్రయాణిస్తున్న గుండేరావు, నర్సింగ్, శ్రావణ్, సిద్దప్పలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా అన్నదమ్ములైన శివసాయి(బన్ని), సిద్దార్థ(సన్ని) తీవ్రంగా గాయపడి కడప వైద్యశాలలో చికత్స పొందుతున్నట్లు తెలుస్తున్నది. కాగా వీరిలో సిద్ధార్ధ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శ్రావణ్, సిద్దప్పలు నగరంలోని దిల్‌షుఖ్‌నగర్‌కు చెందిన వారిగా తెలుస్తుంది.
నిజాంపేట్ సర్కిల్ పరిధి, ఇందిరమ్మ కాలనీ ఫేజ్-1లో నివాసముంటున్న గుండేరావు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో పాటు అతని ఇద్దరు కొడుకులు శివసాయి(బన్ని),సిద్దార్థ(సన్ని)లు తీవ్రంగా గాయపడి వైద్యశాలలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు తెలియడంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. గుండేరావు బస్తీ వాసులతో కలుపుగోలుగా ఉండేవారని, అతని ఇద్దరు పిల్లలు చలాకీగా ఉండేవారని స్థానికులు తెలిపారు. ప్రమాద విషయం తెలియగానే గుండేరావు భార్య శైలు తెల్లవారు జామున 5 గంటలకు ఇంటి నుండి బయలుదేరి కడపకు వెళ్లినట్లు స్థానికులు పేర్కొన్నారు.