జహీరాబాద్, నవంబర్ 16: దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన జహీరాబాద్ పట్టణ సమీపంలోని ఆదర్శ్‌నగర్ పరిధిలోని 65వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. జహీరాబాద్ పట్టణ పోలీసులు కథనం ప్రకారం.. హైదరాబాద్ పట్టణ ప్రాంతంలోని సూరారంలోని శివాలయం కాలనీకి చెందిన సురేశ్, సంజీవ్‌రావు, శివకుమార్, మనోజ్ కలిసి కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా ప్రాంతంలోని గానుగపూర్ దత్తాత్రేయ స్వామి ఆలయానికి దర్శన నిమిత్తం వెళ్లారు.
స్వామివారి దర్శన అనంతరం తిరిగి శుక్రవారం రాత్రి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శ్‌నగర్ కాలనీ సమీపంలో కారు అదుపుతప్పి జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. జహీరాబాద్ పట్టణ ఎస్ఐ కాశీనాథ్ సిబ్బందితో హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారిలో సురేశ్‌కుమార్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా తీవ్రగాయాలైన సంజీవ్‌రావు, మనోజ్, శివకుమార్‌ను చికిత్స నిమిత్తం పోలీసులు జహీరాబాద్ ప్రభుత్వ దవాఖనకు తరలించారు.
వీరి పరిస్థితి ఆందోళనకారంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ క్రమంలో మార్గమద్యంలోనే తీవ్రగాయాలైన నర్సింహారావు మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు మనోజ్, శివకుమార్‌ను సంగారెడ్డికి తరలించగా, అక్కడ ప్రథమ చికిత్స అనంతరం వీరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. నిద్రమత్తులోనే ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జహీరాబాద్ పట్టణ ఎస్ఐ కాశీనాథ్ పేర్కొన్నారు.