సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): నగరంలో గన్స్ విక్రయిస్తున్న ఇద్దరు యూపీ వాసులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. యూపీ, రాంపూర్ సిటీకి చెందిన మహ్మద్ జీషాన్ అలియాస్ జీఖాన్ 2016లో యూపీ నుంచి కుటుంబ సమేతంగా హైదరాబాద్‌కు జీవనోపాధి కోసం వచ్చాడు. మూడు సెలూన్ దుకాణాలను నిర్వహిస్తున్న జీషాన్ తన వ్యాపారాల్లో చేదోడువాదుడుగా ఉండేందుకు యూపీ నుంచి తనకు తెలిసిన మహ్మద్ అమీర్‌ను పిలిపించాడు.
ఇద్దరు విలాసవంతమైన జీవితం గడుపుతూ చెడు అలవాట్లకు బానిసయ్యారు. తమ వ్యాపారంలో వచ్చే ఆ దాయం సరిపోకపోవడంతో ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని సంపాదించేందుకు ఫ్లాన్ చేశారు. ఇందులో భాగంగా యూ పీలో ఈజీగా లభించే తపంచాలను తక్కువ ధరకు కొని హైదరాబాద్‌లో విక్రయించాలని ప్లాన్ చేశారు. యూపీలో రాంపూర్ సిటీకి చెందిన అర్షిఖాన్ను సంప్రదించారు.
కొన్ని రోజుల క్రితం జీషాన్, అమీర్ యూపీ వెళ్లి ఐదు కంట్రీమేడ్ తుపాకులు కొని నగరానికి తీసుకొచ్చారు. జీషాన్ వ్యవహారంపై అనుమానం రావడంతో మహేశ్వరం జోన్ ఎస్ఓటీ పోలీసులు పక్కా సమాచారంతో జీషాన్ ఇంట్లో గురువారం ఉదయం సోదాలు నిర్వహించగా అతడి వద్ద ఐదు తపంచాలు, 13 లైవ్ రౌండ్స్, ఐదు షెల్స్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఎస్ఓటీ అదనపు డీసీపీ షకీర్ హుస్సేన్ ఉన్నారు.