హైదరాబాద్ ఎల్బీనగర్లో విషాదం నెలకొంది.. చింతల్‌కుంట ఏరియాలో ఆదివారం తెల్లవారుఝామున హైటెన్షన్ వైర్లు తెగిపడి ఇద్దరు యాచకులు సజీవదహనమయ్యారు. స్తంభానికి గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వల్ల ఆ ఒత్తిడికి పిన్ ఇన్సులేటర్ రాడ్ విరిగిపడిందని విద్యుత్ అధికారులు తెలిపారు. 11కేవీ చింతల్‌కుంటకు సంబంధించిన పోల్మీదగల పాలిమర్ పిన్ ఇన్సులేటర్లోని మెటల్ రాడ్ దెబ్బతినడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయని వారు చెప్పారు.
కీసర నాగారంలో గతనెల బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలతో పాటు వారి కుమారుడిపై విద్యుత్ తీగ తెగిపడింది. ఈదురుగాలులకు తీగ తెగి మీదపడడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అందులో భార్య చికిత్స పొందుతూ మృతిచెందింది. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లె చెరువు వద్ద నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న ముఖేష్ అనే వ్యక్తిపై విద్యుత్ తీగలు తెగిపడడంతో అక్కడికక్కడే చనిపోయాడు.
చాదర్‌ఘాట్ చిన్నబ్రిడ్జ్పై ఏప్రిల్ 14వ తేదీన సాయంత్రం విద్యుత్ హైటెన్షన్ వైర్ తెగిపడింది. ఈదురుగాలులు వీయడంతో తీగలు తెగిపడినట్లుగా అధికారులు చెప్పారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారుడికి తృటిలో ప్రమాదం తప్పింది.
చింతల్‌కుంటలో ఆదివారం జరిగిన ప్రమాదంపై విద్యుత్ నిపుణులు మాత్రం ఇది కేవలం నిర్వహణలోపమేనని చెబుతున్నారు. అధికారులు చెబుతున్నట్లుగా ఒకవేళ పోల్‌కు ఏదైనా గుర్తుతెలియని వాహనం తగిలితే పోల్ విరగాలని, లేదా కనీసం పెద్ద ఎత్తున దెబ్బతిని ఉండాలని అటువంటి పరిస్థితేమీ అక్కడ కనిపించడం లేదని వారు తెలిపారు.
ఇన్సులేటర్లో రాడ్ విరిగిందంటున్న అధికారులు ఈ ఘటనకు కారణాలను విశ్లేషించడం మానేసి అందరినీ తప్పుదోవపట్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కచ్చితంగా ఇన్సులేటర్లో రాడ్ విరిగితే ఇన్సులేటర్తో సహా వైర్లు గాల్లో వేలాడాలని అటువంటిది కూడా అక్కడ కనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో విద్యుత్ అధికారులు తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది.
ఓవర్‌లోడ్ వల్ల తెగుతున్నాయ్..!
వర్షాకాలం ప్రారంభం కాగానే బ్రేక్డౌన్లు పెరుగుతాయి. వేసవికాలం వైర్లన్నీ బాగా హీట్ అవడంతో పాటు ఓవర్‌లోడ్ కారణంగా కండక్టర్లు కూడా వీక్ అవుతాయి. వర్షం పడగానే వైర్లు దగ్గరకు వచ్చి ఎక్కడైతే వీక్ ఉంటాయో అక్కడ బ్రేక్ డౌన్ అయి తరుచుగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలేర్పడుతున్నాయి. వేసవి కాలం చివరి నుంచి వర్షాకాలం ప్రారంభం వరకు మెయింటెనెన్స్ పేరుతో చేసే పనులు సక్రమంగా చేస్తే ఇటువంటి ప్రమాదాలు జరగవనే విద్యుత్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు కాలం చెల్లిన తీగల వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తీగలను అధికారులు తరచూ పరిశీలించి బలహీనమైతే కొత్తవి ఏర్పాటు చేయాలి. తీగలపై ఓవర్‌లోడ్ పడితే తెగడానికి ఆస్కారముంది. ప్రమాదానికి కారణమైన విద్యుత్ తీగల్లో యాంప్‌ల విద్యుత్ ప్రవాహమే ఉంది. ఈ మాత్రం లోడ్‌కే తీగలు తెగిపడడం విస్తు గొలుపుతోంది. సాధారణంగా విద్యుత్ తీగలు తెగినప్పుడు 11 కేవీ సబ్స్టేషన్లలో బ్రేకర్లు వాటంతటవే పనిచేససి సరఫరా నిలిచిపోతుంది. ఒకవేళ సాంకేతిక కారణాలతో అక్కడ విఫలమైతే 33 కేవీ సబ్‌స్టేషన్‌లో అయినా బ్రేకర్లు పనిచేయాల్సి ఉంటుంది. ఈ రెండు వ్యవస్థలు విఫలమవడంతోనే ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.
నిర్వహణ లోపం వల్లే..!
ప్రతీ ఏటా ఫిబ్రవరి నుంచే 3నెలల పాటు విద్యుత్ నిర్వహణ పనులు చేపడతారు. నిర్వహణ సిబ్బంది స్వయంగా ప్రతీ లైన్‌ను పరిశీలిస్తారు. కిందికి జారిన తీగలను సరిచేయాలి. పాడైన స్తంభాలస్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలి. లైన్లకు అడ్డంగా ఉన్న చెట్లు తొలగించాలి. ఈ పనుల పర్యవేక్షణ లేక ప్రమాదాలకు దారితీస్తున్నట్లుగా నిపుణులు చెప్పారు. అంతేకాకుండా ప్రమాదాల నియంత్రణకు సబ్స్టేషన్లలో ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థలు సరిగా పనిచేయకనే ప్రజల ప్రాణాలు పోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
సబ్‌స్టేషన్‌లో కండక్టర్ల నిర్వహణ , ప్రతీ పీసీబీ కంట్రోల్ దగ్గర రిలే ప్యానల్ ఉంటుంది. ఇందులో ఉండే రెండు కాయిల్స్ క్లోజింగ్ కాయిల్, ట్రిప్పింగ్ కాయిల్స్‌ను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలి. ఈ రెండు కాయిల్స్ సరైన క్వాలిటీ లేకపోయినా ట్రిప్ కాకపోవడంతో వైర్ తెగిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోదు. మరోవైపు ఎక్కడైనా విద్యుత్ వైర్ తెగిపడితే ఫీడర్ ట్రిప్ అయ్యేందుకు 0.15 సెకన్ నుంచి 0.25 సెకన్‌లోపు సమయాన్ని సెట్ చేయాల్సి ఉండగా సిబ్బంది ఈ సమయాన్ని 0.5 నుంచి 1 సెకన్‌కు సెట్ చేస్తున్నారు.
ఇది కేవలం ఎక్కడైనా చెట్లకు వైర్లు తగిలినా, గాలి గట్టిగా వీచినా వైర్లు ఊగితే ట్రిప్ అవుతుందని అందుకోసం ఈ రకంగా సెట్ చేస్తున్నట్లు సిబ్బంది చెప్పారు. కానీ ట్రాన్స్‌కోలో మాత్రం వైర్ తెగిన వెంటనే ఫీడర్ ట్రిప్ అవుతుందని, ఇలా డిస్కంలో సెట్ చేస్తే సెట్ కాదని వారు పేర్కొన్నారు. దీంతో ప్రమాదాలకు ఆస్కారముంటోంది. మరోవైపు విద్యుత్ తీగలు తెగిపడిన వెంటనే ఎర్తింగ్ కావాలని, క్షణల్లో ఆ లైన్లలో సరఫరా నిలిచిపోవాలని కానీ ఆ విధంగా జరగడం లేదని వారు చెప్పారు. విద్యుత సరఫరా చేసే స్తంభాలు, తీగలను శాశ్వత ప్రాతిపదికన పటిష్టం చేయకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు చెప్పారు.