సిటీబ్యూరో/ చాంద్రాయణగుట్ట, జూన్ 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం కారణంగా పాతబస్తీలో తీవ్ర విషాదం నెలకొంది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి ఇద్దరు యువకులు కరెంట్‌షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. పాతబస్తీలో కురిసిన భారీ వర్షానికి కరెంట్ తీగలు తెగి రోడ్డుపై పడటంతో ఇద్దరు మృతి చెందారు. బండ్లగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటో డ్రైవర్ అఫ్రోజ్(30), మహ్మద్ జాఫర్(15) విద్యార్థి. ఈ ఇద్దరు జాంగీరబాద్ బస్తీలో పక్కపక్క ఇండ్లలో ఉంటారు. మంగళవారం సాయంత్రం టీ తాగడానికి బండ్లగూడలోని రాయల్ సీ హోటల్ వద్దకు ఆటోలో వచ్చారు.
అనంతరం వర్షంలోనే బస్తీలోకి వెళ్లే క్రమంలో అప్పటికే వర్షానికి కరెంట్ తీగలు తెగి రోడ్డుపై పడిన విషయం గమనించలేదు. దీంతో ఆటో దిగి నడుచుకుంటూ వెళ్తుండగా కరెంట్ తీగలు కాలికి తగలడంతో ఇద్దరు ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్‌తో పడిపోయారు. స్థానికులు గమనించి హుటాహుటిన వచ్చి పరిశీలించగా అప్పటికే అఫ్రోజ్ మృతి చెందాడు. కొన ఊపిరితో ఉన్న మహ్మద్ జాఫర్‌ను ఆటోలో ఒవైసీ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. కుటుంబ సభ్యులు, స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు బండ్లగూడ పోలీసులు తెలిపారు.
పాతబస్తీలోని బండ్లగూడ వద్ద జేసీబీతో జీహెచ్ఎంసీ నాలా తవ్వకం పనులు చేస్తుండగా స్ట్రీట్‌లైట్ ఎల్టీ కేబుల్ తెగి నేలపై పడిపోయింది. వర్షపు నీటిలో పడి ఉన్న లైన్ ఎలక్ట్రిక్ కేబుల్ కారణంగా ఆటో నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు కరెంట్ షాక్‌కు గురయ్యారని టీజీఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు ప్రకటన విడుదల చేశారు. అయితే కరెంట్ తీగలు తెగి భూమ్మీద పడగానే ఫీడర్ ట్రిప్ కావాలి కానీ కాలేదు. అయితే ఈ ఘటనకు జీహెచ్ఎంసీదే బాధ్యత అని ప్రకటనలో పేర్కొనగా, తాము బాధ్యులం కాదంటూ జీహెచ్ఎంసీ పేర్కొన్నది. దీంతో రెండు శాఖల నిర్లక్ష్యం వల్లే రెండు నిండుప్రాణాలు బలయ్యాయంటూ స్థానికులు మండిపడుతున్నారు.