సిటీబ్యూరో, జూన్ 3(నమస్తే తెలంగాణ): నగరంలో స్పా సెంటర్లను పోలీసులమని చెప్పి టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నకిలీ పోలీసులను హైదరాబాద్ వెస్ట్‌జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శాలిబండకు చెందిన రౌడీషీటర్ సయ్యద్ అహ్మద్ హష్మి అలియాస్ మిర్చి అహ్మద్, మహ్మద్ ఫయాజ్ అలియాస్ షరీఫ్‌లు తమ అనుచరులతో కలిసి సిటీలో ఉన్న స్పా సెంటర్లపై దాడులు చేసి, తాము సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులమని చెప్పి స్పా సెంటర్ల సిబ్బందిని డబ్బులు డిమాండ్ చేసేవారని పోలీసులు తెలిపారు.
ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, మాసబ్‌ట్యాంక్, మాదాపూర్‌లలో ఉన్న స్పా సెంటర్లలో రూ.50వేల నుంచి రూ.60వేలు వసూలు చేసేవారని తెలిపారు. ఇదే క్రమంలో ఒక స్పా సెంటర్లో డబ్బులు డిమాండ్ చేస్తున్న సమయంలో ఈ ఇద్దరు సూడో పోలీసులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్, మాసబ్‌ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.20వేల నగదు, ఒక స్పై కెమెరా, వన్‌ప్లస్ మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సీహెచ్.యాదేందర్, ఎస్ఐ జాహెద్ తదితరులు ఆధ్వర్యంలో నిర్వహించారు.