సరిగ్గా యాభైరోజుల క్రితం… బీదర్‌లో ఏటిఎం నుంచి చోరీ చేసి అఫ్జల్‌గంజ్‌కు వచ్చి జనవరి 16న నగరంలో కాల్పులు జరిపారు. ఈ కేసులో ఇద్దరు నేరస్తులు పోలీసుల కంటపడకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు నిందితులను పోలీసులు పట్టుకోలేదు. వారి కోసం పోలీసు బృందాలు వెతుకుతున్నా నిందితుల జాడ కనిపెట్టలేని పరిస్థితి. నగరం నుంచి ఎటు వెళ్లారో ఎక్కడికి చేరుకున్నారో పోలీసులు చెప్పలేకపోతున్నారు
గత ఏడాది దోమలగూడలో స్వర్ణలత అనే వృద్ధురాలిని హత్యచేసి ఇద్దరు దొంగలు కోటిరూపాయల సొత్తుతో ఉడాయించారు. ఈకేసులో మనోజ్, రాహుల్, మహేశ్ అనే నిందితులు అప్పటి నుంచి పరారీలో ఉండగా ఇటీవల నారాయణగూడలో జరిగిన ఓ చోరీ కేసులో మనోజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కూడా మనోజ్ పనిమనిషిగా చేరి కొంతకాలంగా పనిచేసినప్పటికీ పోలీసులు పసిగట్టలేకపోవడం గమనార్హం. ప్రస్తుతం రాహుల్, మహేశ్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదే ఏడాది జనవరిలో బంజారాహిల్స్, ఖైరతాబాద్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఓ వ్యక్తికి చెందిన కారు ఎత్తుకెళ్లి చైన్‌స్నాచింగ్ చేసిన ఘటనలో ఇప్పటివరకు నిందితుడు దొరకలేదు.బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12లో కారు ఎత్తుకెళ్లి ఆనంద్‌నగర్ సమీపంలో ఓ మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఆరు పోలీస్ బృందాలు నిందితుడి కోసం గాలించినా ఇప్పటివరకు
పట్టుకోలేదు.
గత డిసెంబర్లో బంజారాహిల్స్ పరిధిలో ఒక విశ్రాంత అధికారి పేరు మీద ఉన్న స్థలాన్ని కొట్టేయడానికి కొందరు ప్రయత్నించారు. ఆయన బతికుండగానే డెత్ సర్టిఫికెట్లు, నకిలీ వారసత్వ సర్టిఫికెట్లు సృష్టించారు. ఇందుకు సంబంధించి ఫిలింనగర్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇప్పటివరకు వారు పోలీసులకు చిక్కలేదు.
గతసంవత్సరం అక్టోబర్‌లో అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధి డిడి కాలనీలో లింగారెడ్డి, ఊర్మిళాదేవి అనే వృద్ధ దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. తలపై బాది, గొంతుకోసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే నిందితులెవరు.. ఎందుకు వీరిని హత్య చేశారనేది ఇప్పటివరకు పోలీసులు తేల్చలేకపోయారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించినా నిందితులు మాత్రం ఇప్పటివరకు ఎవరనేది గుర్తించకపోవడం, ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది.
సిటీబ్యూరో, మార్చి 6(నమస్తే తెలంగాణ): ఇవన్నీ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన ఘటనలు.. నిందితులకోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండాపోతున్నది. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి ఉదంతాలు చాలా వరకు జరుగుతున్నా నిందితులు మాత్రం చిక్కడం లేదు. నేరం జరిగిన వెంటనే నిందితులను పట్టుకోవడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు చాలా కేసుల్లో విఫలమవుతున్నాయి. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు.. నేరం ఎటువంటిదైనా కొన్ని కేసుల్లో నేరగాళ్ల జాడ నెలలు గడిచినా దొరకడం లేదు.
ప్రధానంగా నగరంలో సంచలనం సృష్టించిన ముఖ్యమైన కేసుల్లోనూ ఈ పరిస్థితే కనిపిస్తున్నది. నెలల తరబడి నిందితుల కోసం అన్వేషణ కొనసాగిస్తున్న పోలీసు బృందాలకు చివరకు కేసు పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తున్నది. ఒక్కో కేసులో ఒక్కో రీతిలో నిందితులు పోలీసులకు సవాల్ విసురుతూ దేశం దాటి పోతున్నారు. నేపాల్, బంగ్లాదేశ్ తదితర ప్రాంతాలకు పారిపోతున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తమను దేశం దాటించడానికి అక్కడ ఉన్న దళారులతో కూడా ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారనే సమాచారం నగర పోలీసులకు ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లలో 20శాతం కేసులు పెండింగ్‌లో ఉన్నట్లుగా అంచనా.
నిందితులను వెతికే క్రమంలో ఆర్థిక వనరుల విషయంలోనూ కొంత సమస్య తలెత్తుతున్నదని, దీనికి సంబంధించి కొన్నిచోట్ల తామే సొంతంగానే ఖర్చు చేస్తున్నామని ఒక పోలీస్ అధికారి వాపోయారు. నేరస్తులను కనిపెట్టడంలో తెలంగాణ పోలీసులకు దేశంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏ రాష్ట్రంలో లేని సీసీ కెమెరాలు, వాహనం ఎంత వేగంగా వెళ్తున్నా రిజిస్టేష్రన్ నంబర్ గుర్తించే సాంకేతికత హైదరాబాద్ పోలీసుల సొంతం. కేసుల దర్యాప్తుల్లో పోలీసులు తీసుకుంటున్న చర్యలు సోషల్ మీడియాలోవైరల్ అవుతున్నాయి. దీంతో మారుమూల ప్రాంతాలకు కూడా నేరగాళ్ల సమాచారం చేరుతోంది. అత్యాధునిక సాంకేతికత ఉన్నా.. నిందితులను కనిపెట్టడానికి పోలీసుల ప్రయత్నాలు ఫలించడం లేదు.