Hyderabad | ముషీరాబాద్, జనవరి 11: కొండపోచమ్మ రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు అన్నదమ్ముళ్లు మృత్యువాతపడ్డారు. దీంతో ముషీరాబాద్ భోలక్‌పూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కుమారులు నీటి మునిగి మరణించడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణణాతీతం. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం కొండపోచమ్మ రిజర్వాయర్‌లో ఈతకెళ్లి ఐదుగురు యువకులు మృతి చెందారు. ధనుష్ (20), లోహిత్ (17), వారి మిత్రులు దినేశ్వర్ (17), సాహిల్ (19), జితిన్ (17), మృగాంక్, ఎండీ ఇబ్రహీంలు శనివారం ఉదయం ద్విచక్ర వాహనాలపై కొండపోచమ్మ రిజర్వాయర్‌కు వెళ్లారు.
ఉదయం 11 గంటల సమయంలో ఈత కొడుదామని లోపలికి వెళ్లి ఒకరి తరువాత ఒకరు నీటి మునిగారు. మృగాంక్, ఎండీ ఇబ్రహీంలు బతికి బయటపడగా.. మిగిలిన వారు మృత్యువాత పడ్డారు. భోలక్‌పూర్ ఇందిరానగర్‌కు చెందిన నర్సింహ, జయమ్మల పెద్ద కుమారుడు ధనుష్ ఫొటో స్టూడియోలో పని చేస్తుండగా, చిన్న కుమారుడు లోహిత్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఒకే ఇంట్లో ఇద్దరు కుమారులు మృత్యువాత పడటంతో ఇందిరానగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు కొడుకులను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. మృత్యు వార్త తెలిసిన వెంటనే ధనుష్ కుంటుంబ సభ్యులు కొండపోచమ్మ రిజర్వాయర్‌కు తరలి వెళ్లారు.
ఖైరతాబాద్, జనవరి 11: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం, కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద జరిగిన ఘటనలో ఖైరతాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చింతలబస్తీకి చెందిన జతిన్ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. చింతలబస్తీకి చెందిన కోటేశ్వర్రావు, పద్మ దంపతుల రెండో కుమారుడు జతిన్ డిప్లొమా చేస్తున్నాడు.
కాగా, శనివారం కొండపోచమ్మ రిజర్వాయర్‌లో సరదా గడిపేందుకు జతిన్ తన స్నేహితులైన ముషీరాబాద్‌కు చెందిన ధనుశ్, లోహిత్, బన్సీలాల్‌పేటకు చెందిన దినేశ్వర్, సాహిల్‌తో కలిసి వెళ్లాడు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో రిజర్వాయర్‌లో పడి మృతి చెందారు. జతిన్ తండ్రి కోటేశ్వర్రావు స్థానికంగా గూడ్స్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొడుకు మరణవార్తతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తూ సిద్దిపేటకు బయలుదేరివెళ్లారు. జతిన్ మృతితో చింతలబస్తీలో విషాఛాయలు అలుముకున్నాయి.
బన్సీలాల్‌పేట్, జనవరి 11: తండ్రి పుట్టిన రోజున కొడుకు మృత్యువాత పడ్డాడు. బన్సీలాల్‌పేట్ డివిజన్లోని చాచా నెహ్రూనగర్‌లో నివాసముంటున్న చీకట్ల కిషన్, సుమలత దంపతుల కుమారుడు దినేశ్వర్(17) శనివారం సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్‌లో ఈత కోసం వెళ్లి మృతువాతపడ్డాడు. దినేశ్వర్ నగరంలోని టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లొమా చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులు ఉండటంతో తోటి స్నేహితులతో కలిసి ఈతకెట్టేందుకు కొండపోచమ్మ సాగర్‌కు వెళ్లారు. మొత్తం ఏడుగురు ఈతకు వెళ్లగా.. ఐదుగురు డ్యామ్‌లో మునిగి చనిపోయారు. ఇద్దరు మాత్రమే బతికి బయట పడ్డారు.
ఈ ఘటనలో కేవలం దినేశ్వర్ మృతదేహం మాత్రమే బయటకు వచ్చింది. పోలీసులు దినేశ్వర్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆదివారం బన్సీలాల్‌పేట్‌లో అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు. విషయం తెలియగానే చాచానెహ్రూనగర్లోని దినేశ్వర్ నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. అద్దె ఇంట్లో ఉంటున్న కిషన్ డ్రైవర్‌గా, తల్లి సుమలత ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నారు. వారికి దినేశ్వర్తోపాటు ఓ కుమార్తె ఉన్నది. శనివారం కిషన్ పుట్టినరోజు కావడం, అదే రోజు కుమారుడు మృతువాత పడడం వారి కుటుంబంలో విషాదకరమైన రోజుగా మిగిలిపోయింది.