Jeevandan | ఖైరతాబాద్, సెప్టెంబర్ 7 : మరణిస్తూ పలువురికి అవయవదానంతో జీవనదానం చేశారు ఆ యువకులు. జీవన్‌దాన్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీభూషణ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా మాగుంట లేఅవుట్‌కు చెందిన మారెళ్ల అభిలాష్ (28) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 30 ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, డివైడర్‌ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానేలో చేర్పించగా, చికిత్స అందిస్తున్న వైద్యులు ఈ నెల 6న బ్రేయిన్డెడ్కు గురైనట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులను కలిసిన జీవన్‌దాన్ ప్రతినిధులు అవయవదానం విశిష్టను వివరించగా, అందుకు అంగీకరించారు. కాలేయం, రెండు మూత్రపిండాలను సేకరించి ఇతరులకు అందించి జీవనదానం చేశారు.
మరో ఘటనలో….
నిజామాబాద్ డిచ్పల్లి ధర్మాబాద్ (బి)కి చెందిన బుర్రా రాజేశ్ (33) గత కొంత కాలంగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నాడు. ఈ నెల 5న తీవ్రమైన తలనొప్పితో ఇంట్లో కుప్పకూలిపోయాడు. అతన్ని వెంటనే ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి నిమ్స్‌లో చేర్చారు. చికిత్స అందిస్తున్న వైద్యులు ఈ నెల 6న బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు నిర్ధారించారు. అతని శరీరం నుంచి కాలేయం, రెండు కార్నియాలను సేకరించారు.